మేఘాలను మథిస్తారా?

2 Aug, 2019 08:18 IST|Sakshi
కృత్రిమ వర్షాల కోసం రప్పించిన విమానం

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో  కృత్రిమ వర్షాల ప్రయోగం?  

హుబ్లీకి చేరిన ప్రత్యేక విమానం  

కర్ణాటక, హుబ్లీ:  రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని తీవ్ర వర్షాభావం నెలకొంది. కృష్ణమ్మ ఉప్పొంగుతున్నా, చినుకులేక రైతన్న కుంగిపోతున్నాడు. ఈ తరుణంలో కృత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఒక చిన్న విమానం హుబ్లీ విమానాశ్రయానికి వచ్చి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం వర్షధారె పథకానికి ఒకటి, రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. జూన్‌లో వర్షాలు కురవని సమయంలో మేఘ మథనం కోసం విమానం వచ్చి ఉంటే బాగుండేది. అయితే ప్రస్తుతం వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్న వేళ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా వర్షాలు పడుతున్నప్పుడు హుబ్లీ విమానాశ్రయం కేంద్రంగా మేఘమథనాన్ని ప్రారంభించారు. గత కుమారస్వామి ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌ శాఖ రూ.45 కోట్ల వ్యయంతో వర్షధారె పేరిట మేఘమథనాన్ని నిర్వహించింది. 

బీదర్‌ను కాదని హుబ్లీ నుంచి..
బీదర్‌లో వాయుసేన విమానాశ్రయం ఉంది. మేఘమథనం  కార్యాచరణను అక్కడి నుంచే నిర్వహించడం సులభమే అయితే హుబ్లీ విమానాశ్రయాన్ని ఎంపిక చేసుకోవడంపై అనుమానాలు తలెత్తాయి. సురపురలో రాడార్‌ కేంద్రం ఉంది. ఆ ప్రాంతంలో అక్కడి నుంచే సిగ్నల్‌ పొందడానికి బదులుగా గదగ్‌ సమీపంలోని హులకోటి కేంద్రం నుంచి సిగ్నల్‌ను పొందాలని యోచించారు. ఇక్కడి నుంచి విమానం యాదగిరి ప్రాంతానికి వెళ్లేలోపు మేఘాలు మాయమైపోతే ఎలాగనే ప్రశ్నలున్నాయి. ఖ్యాతి సంస్థ చైర్మన్‌ ప్రకాశ్‌ కోళివాడ కాంగ్రెస్‌ ప్రముఖ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ రాణిబెన్నూరుకు చెందిన కేబీ కోళివాడ పుత్రుడు కావడంతో ఆయనకే ఆగమేఘాలపై కాంట్రాక్టు కట్టబెట్టినట్లు విమర్శలున్నాయి. 

రూ.45 కోట్ల లెక్కను తేల్చేవారెవరు?
ఎంత మేర సిల్వర్‌ అయోడైడ్‌ వాడారు, ఎంత ప్రమాణంలో వర్షం వచ్చింది అన్న దానిపై కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులు చెప్పిందే లెక్క. వర్షధారె పథకానికి రూ.45 కోట్లను కేటాయించారు. వరుణుడు కరుణించకపోయినా ఈసారి పూర్తిగా రూ.45 కోట్లను కృత్రిమ వర్షాలకు ఖర్చుపెట్టడం ఖాయమన్న విమర్శలు వినబడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కృత్రిమ వర్షాల ఫలితాలపై చాలా అనుమానాలు తలెత్తాయి. 

రాడార్‌ గుర్తిస్తుంది, విమానం వెళ్తుంది
రాడార్‌  కేంద్రంలో ఆర్‌డీపీఆర్, ఐఐఎం, ఐఐటీ శాస్త్రవేత్తలు, నిపుణుల బృందం మేఘాల అధ్యయనం చేస్తారు. రాడార్‌ సుమారు 200 కిలోమీటర్ల వరకు గల మేఘాలను అధ్యయనం చేస్తుంది. తేమ శాతం గల ఫలవంతమైన మేఘాలను గుర్తించి పైలెట్లకు సూచిస్తుంది. పైలెట్లు విమానం ద్వారా ఆ మేఘాలపై సిల్వర్‌ అయోడైడ్‌ ద్రావణంను చల్లుతారు. అప్పుడు మేఘాలు ద్రవరూపం దాల్చి వర్షం కురుస్తుంది. నిపుణులు వర్షనమూనాలను పరిశీలించి ఈ వర్షం సిల్వర్‌ అయోడైడ్‌ వల్లనే కురిసిందా, లేదా అనేది నివేదిక ఇస్తారు.  

అమెరికా నుంచి విమానాల రాక 
ఖ్యాతి క్లైమేట్‌ మాడిఫికేషన్‌ కంపెనీకి మేఘమథనం బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు అమెరికా నుంచి రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. జూలై 25న మైసూరులో కృత్రిమ వర్షాలకు శ్రీకారం చుట్టారు. కాగా హుబ్లీ విమానాశ్రయానికి ఓ ప్రత్యేక విమానం వచ్చింది. బెంగళూరు, గదగ్, సురపురలలో మూడు రాడార్‌ కేంద్రాలున్నాయి. గదగ్‌ రాడార్‌ కేంద్రం శాస్త్రవేత్తల మార్గదర్శనం ప్రకారం పైలెట్లు ఉత్తర కర్ణాటకలోని విజయపుర, బాగల్‌కోటె, రాయచూరు, యాదగిరి, బీదర్, కొప్పళ, ధార్వాడ, గదగ్, హావేరి తదితర జిల్లాల పరిధిలో మేఘమథనం జరుగుతుందని వర్షధారె పథకం నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిదానందమూర్తి తెలిపారు. హైదరాబాద్‌ కర్ణాటక జిల్లాల్లో వర్షపాతం తగ్గింది. రాయచూరు, కలబుర్గి, యాదగిరి జిల్లాల్లో కొన్ని చోట్ల సరైన వర్షాలు లేనేలేవు. 

మరిన్ని వార్తలు