స్పెషల్‌ వైద్యం

2 Feb, 2017 02:40 IST|Sakshi
స్పెషల్‌ వైద్యం

వైద్య రంగానికి రూ. 47,352 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను గణనీయంగా పెంచాలని బడ్జెట్‌ ప్రసంగంలో జైట్లీ తెలిపారు. ద్వితీయ, తృతీయ స్థాయిల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తగినంత మంది స్పెషలిస్టు వైద్యుల అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఏటా అదనంగా 5 వేల పీజీ సీట్లను సృష్టించనున్నట్లు తెలిపారు. 2017–18లో మొత్తంగా వైద్య రంగానికి రూ. 47,352.51 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2016–17లో ఈ రంగానికి కేటాయించిన రూ. 37,061.55 కోట్లకన్నా తాజా కేటాయింపు 27.76 శాతం అధికమన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆయుష్‌ మంత్రిత్వశాఖకు రూ. 1,428.65 కోట్లు, వైద్య పరిశోధన విభాగానికి రూ. 1,500 కోట్లు (గతేడాది కేటాయింపులు రూ. 1,144.80 కోట్లు) కేటాయిస్తున్నామన్నారు.

జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్‌బీ కోర్సులు...
పెద్ద జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్‌బీ కోర్సులను ప్రవేశపెడతామని, ఎంపిక చేసిన ఈఎస్‌ఐ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆస్పత్రుల్లో పీజీ బోధనను బలోపేతం చేస్తామని, పేరుగాంచిన ప్రైవేటు ఆస్పత్రులు డీఎన్‌బీ కోర్సులు ప్రారంభించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.  

సరసమైన ధరల్లో మందులు...
దేశంలో జెనరిక్‌ మందులను ప్రోత్సహించేందుకు, ఔషధాలన్నీ సరసమైన ధరల్లో ఉండేలా చూసేందుకు ఔషధాలు, సౌందర్య సాధనాల నిబంధనలను సవరిస్తామని జైట్లీ తెలిపారు. వైద్య పరికరాల నియంత్రణకు కొత్త నిబంధనలు రూపొందిస్తామన్నారు.

ఈ ఏడాదిలోగా బోదకాలు వ్యాధి నిర్మూలన
దేశం నుంచి కాలా–అజర్, బోదకాలు, కుష్టు, తట్టు వ్యాధులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. 2017కల్లా కాలా–అజర్, బోదకాలు వ్యాధులను, 2018కల్లా కుష్టు, 2020కల్లా తట్టును, అలాగే 2025 నాటికి క్షయను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో జైట్ల చెప్పారు.

శిశు, బాలింత మరణాల తగ్గుదలకు ప్రణాళిక
2014లో ప్రతి వెయ్యి జననాలకు 39గా ఉన్న శిశు మరణాల రేటును 2019కల్లా 28కి తగ్గించేందుకు, 2011–13 కాలానికి ప్రతి లక్ష శిశు జననాలకు 167గా నమోదైన బాలింతల మరణాల రేటును 2018–20కల్లా 100కు తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని జైట్లీ చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాలను వెల్‌నెస్‌ సెంటర్లుగా మారుస్తామన్నారు.

మరిన్ని వార్తలు