బుల్లి ఉపగ్రహాల కోసం ప్రత్యేక రాకెట్‌

9 Jan, 2020 02:14 IST|Sakshi

సూళ్లూరుపేట: వాణిజ్య పరంగా ఎంతో ఉపయుక్తంగా ఉండే చిన్న చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే దీన్ని ప్రయోగించనుంది. ఇందుకోసం తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 వంటి ఐదు రకాల రాకెట్‌లను రూపొందించిన ఇస్రో ఆరో రకం రాకెట్‌గా ఎస్‌ఎస్‌ఎల్‌వీని తయారుచేస్తోంది.

చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగానికి వివిధ దేశాల నుంచి డిమాండ్‌ అధికంగా ఉండటంతో ఇస్రో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా దేశీయంగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రయోగాత్మకంగా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారు తయారు చేస్తున్న బుల్లి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.  ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ వివరాలివీ..
ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ 300 కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన చిన్నతరహా ఉపగ్రహాలను ఎన్నింటినైనా సునాయాసంగా తీసుకెళుతుంది.  34 మీటర్ల పొడవు, 2.1 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ రాకెట్‌ ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు వుంటుంది. ఈ రాకెట్‌ను కూడా నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఇందులో మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ మాత్రమే ద్రవ ఇంధనం సాయంతో ప్రయోగించేలా డిజైన్‌ చేశారు. 300 కేజీల నుంచి 500 కేజీల బరువు కలిగి బహుళ ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో)లోకి ప్రవేశపెట్టేలా దీన్ని రూపొందించారు. 

మరిన్ని వార్తలు