అభాగ్యులకు ఆపన్న హస్తం... ‘నల్సా’.. 

16 May, 2020 03:52 IST|Sakshi

లాక్‌డౌన్‌ వేళ జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ విశేష సేవలు 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ విధించిన లాక్‌డౌన్‌లో అభాగ్యులకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) అండగా నిలిచింది. అసాధారణ పరిస్థితుల్లో అత్యంత వేగంగా స్పందించి ఆపన్న హస్తం అందించింది. సుప్రీం కోర్టులో రెండో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్న ‘నల్సా’అభాగ్యులకు న్యాయపరమైన సేవల్లో విశిష్టంగా కృషిచేసింది. వివిధ వర్గాల ప్రజల ఆర్థిక సమస్యలు మొదలుకొని సామాజిక, చట్టపరమైన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా బలహీన వర్గాల ప్రజలు, మహిళలు, చిన్నారులు, కార్మికులు, ఖైదీలు, ఇతర అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలపై ఈ లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపగా.. ఆయా వర్గాలకు ‘నల్సా’న్యాయ సహాయం అందేలా చూసింది.

జైళ్లలోనూ భౌతిక దూరం పాటించేలా...  
జైళ్లపై ఒత్తిడి తగ్గేలా, ఖైదీలపై కరోనా ప్రభావం పడకుండా చేయడంలో సఫలీకృతమైంది. ‘నల్సా’మార్గదర్శనం మేరకు రాష్ట్రాల న్యాయసేవల ప్రాధికార సంస్థలు(ఎస్‌ఎల్‌ఎస్‌ఏ) జైళ్లలో ఖైదీలు భౌతిక దూరం పాటించాలన్న లక్ష్యం సాధనలో విజయం సాధించాయి. ఖైదీల విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పడిన హైపవర్డ్‌ కమిటీలకు ఎస్‌ఎల్‌ఎస్‌ఏల బాసటతో ఈ ప్రక్రియ సులభతరమైంది. పర్యవసానంగా దేశవ్యాప్తంగా 42,529 మంది విచారణ ఖైదీలు విడుదలయ్యారు. 16,391 మందికి పెరోల్‌ దక్కింది. వీరు కాకుండా సీఆర్‌పీసీ 436ఏ సెక్షన్‌ పరిధిలో 243 మంది విచారణ ఖైదీలు బెయిల్‌ పొందారు. ఇక 9,558 మందికి రిమాండ్‌ దశలో న్యాయ సేవలు లభించాయి.

గృహ హింస కేసుల్లో.. 
మహిళలు గృహ హింస ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వారందరికీ సాయంగా నిలిచేందుకు ప్రతి రాష్ట్రంలో వన్‌ స్టాప్‌ సెంటర్స్‌(ఓఎస్సీ)లకు సహకారం అందించాలని ఎస్‌ఎల్‌ఎస్‌ఏలకు ‘నల్సా’మార్గదర్శనం చేసింది. బాధితులకు న్యాయ సాయం , మహిళా న్యాయవాదుల ప్యానెల్‌ ద్వారా ఫోన్‌లో కౌన్సెలింగ్‌ అందేలా చేసింది. ఈ సెంటర్ల ద్వారా 359 కేసుల్లో న్యాయ సహాయం అందించింది. ఇందులో 176 కేసులు గృహ హింసవే. వివిధ రూపాల్లో మొత్తంగా 658 గృహ హింస కేసుల్లో న్యాయ సేవలు దక్కాయి. అలాగే వేతనాలు రాలేదంటూ 1882 అభ్యర్థనలు రాగా.. ఆయా కేసుల్లో న్యాయ సేవల సంస్థలు సాయం చేశాయి. ఒక్క బిహార్‌లోనే 1018 మందికి ఈ తరహా సాయం అందింది. అలాగే ఇల్లు ఖాళీ చేయిస్తున్నారంటూ అందిన 310 ఫిర్యాదుల్లోనూ బాధితులకు తోడుగా నిలిచాయి.

మరిన్ని వార్తలు