'మాట ఇచ్చి మర్చిపోతే ఎలా?'

28 Jul, 2016 18:49 IST|Sakshi
'మాట ఇచ్చి మర్చిపోతే ఎలా?'

న్యూఢిల్లీ: విభజన సమయంలో  ఏపీ విషయంలో నాటి ప్రధాని ఆరు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ అన్నారు. గురువారం సాయంత్రం రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చను జైరాం రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలు స్పృషించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఏపీకి ఇవ్వాలని అడిగితే కాదు పదేళ్లు ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు కోరారని ఆయన గుర్తు చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని అప్పుడే నిర్ణయించామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

రాజధాని నిర్మాణానికి ఎంత సాయం చేశారో చెప్పాలని, హైకోర్టు విభజన అంశం ఏమైందని నిలదీశారు. రెవిన్యూలోటు భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారని జైరాం ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క, ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం అమలుచేయాలని సమాజ్ వాది పార్టీ నేత ఎంపీ నరేష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మాట నిలబెట్టుకోవాలని అన్నారు.

అలాగే, ఏపీతో సహా పది రాష్ట్రాల పరిస్థితి ఏం బాగోలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుఖేందురాయ్ అన్నారు. బెంగాల్ తో సహా ఆ పది రాష్ట్రాలతో కేంద్రం సమావేశం ఏర్పాటుచేయాలని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఇవ్వాలని కోరారు. జేడీయూ ఎంపీ అన్సారీ కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తూ అధికారంలోకి వచ్చాక అంతకుముందు ఇచ్చిన హామీలు మర్చిపోకూడదని అన్నారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలు గుర్తుచేసుకుంటే మంచిదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు