అతను బిచ్చగాడు కాదు.. ఇంజనీర్‌

19 Jan, 2020 15:20 IST|Sakshi

పూరి : పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద  సుమారు 51 ఏళ్ల వయసున్న ఒక బిచ్చగానికి , రిక్షావాడికి చిన్నపాటి గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా వారిద్దరు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. రోడ్డు మీద వెళ్లేవారు చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిద్దరిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇద్దరి మధ్య గొడవకు కారణాన్ని ఫిర్యాదు రూపంలో రాయమని పోలీసులు ఇద్దరిని అడిగారు. రిక్షా అతడికి చదువు రాకపోవడంతో ఫిర్యాదును సరిగా రాయలేకపోయాడు. కానీ విచిత్రంగా పక్కనే ఉన్న బిచ్చగాడు మాత్రం ఫిర్యాదును ఇంగ్లీష్‌లో రాయడంతో ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. అందులోనూ ఆ బిచ్చగాడు రాసిన ఫిర్యాదులో ఒక్క తప్పు కూడా లేకపోవడం విశేషం.

దీంతో బిచ్చగాడి గురించి పోలీసులు ఆరా తీయగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. అతను బిచ్చగాడు కాదని... ఒక ఇంజనీర్‌ అని తెలిసింది. వినడానికి అచ్చం సినిమా కథను తలపిస్తున్నా.. ఇది అక్షరాల నిజం. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా .. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథ ఆశ్రమంలో పెరగుతూ మిశ్రా కష్టపడి బీఎస్సీ గ్రూప్‌లో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ముంబయి వెళ్లి కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు. తర్వాత సీపెట్‌ నుంచి ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని మిల్టన్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేశాడు.  తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని, హైదరాబాద్‌ను వదిలి ఒడిశాలోని పూరికి తిరిగి వచ్చి జగన్నాథ ఆలయం దగ్గర బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

ఇదే విషయమై గిరిజా శంకర్ మిశ్రాను అడడగా.. ' ఈ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను. నేను బిచ్చగాడిగా మారడానికి నాకు కొన్ని సొంత కారణాలు ఉన్నాయి. నేను ఇంజనీర్‌గా పని చేసిన మాట నిజమే.. కానీ నాపై అధికారులతో విభేదాలు వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి ఇలా బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నానని' తెలిపాడు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయొద్దని మిశ్రా పోలీసులను అభ్యర్థించడంతో వారు అందుకు అంగీకరించి ఇద్దరిని వదిలిపెట్టారు. మిశ్రా తన ఉద్యోగాన్ని వదిలేసి బిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా.. రోజు రాత్రిళ్లు మాత్రం వీధి దీపాల కింద వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతాడని తెలిసింది.

మరిన్ని వార్తలు