మోదీ దూకుడు కొనసాగుతుందా..?

26 May, 2016 08:48 IST|Sakshi
మోదీ దూకుడు కొనసాగుతుందా..?

మోదీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలనకు నేటితో  రెండు సంవత్సరాలు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? పొందిన వైఫల్యాలేమిటి? అనే చర్చ దేశమంతటా జరుగుతోంది. ఆర్థిక రంగంలో మాత్రం ఆ వడి లేదు. అడుగులు ఇంకా తడబడుతున్నాయ్. ‘అచ్చేదిన్’ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
 

పెరిగిన వృద్ధి నిలబడుతుందా?  రెండేళ్లలో పలు సంస్కరణల్ని తెచ్చిన మోదీ
స్థూల దేశీయోత్పత్తిలో భారతదేశ వేగం... చైనాను కూడా మించిపోయింది.
కాకపోతే!! ఇదంతా వృద్ధిని లెక్కించేందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్న
సంవత్సరాన్ని మార్చటం వల్లే సాధ్యమైందనే విమర్శలొచ్చాయి.
చైనా సహా ఎవ్వరితో పోటీ పడాలన్నా తయారీ రంగమే కీలకం కనక
మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని అందుకున్నారు.
 దీనికోసం ఏకంగా 400 బిలియన్ డాలర్లు... అంటే
 రూ.27.2 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలొచ్చాయి. ఇవి సాకారమైతే
 తయారీ రంగ వేగానికి హద్దులుండవనేది కాదనలేని వాస్తవం.
(సాక్షి, బిజినెస్ విభాగం)

 ఇక బ్యాంకులన్నీ మొండి బకాయిల్ని క్లీన్ చేసుకోవాల్సిందేనంటూ వాటి ప్రక్షాళనకు రిజర్వు బ్యాంకు నడుం బిగించింది. మోదీ సర్కారు వాటికి తన మద్దతుగా కొంత నగదునిచ్చింది. కాకపోతే బ్యాంకులన్నీ తమ ఎన్‌పీఏలను బయటపెట్టడం మొదలెట్టాక వాటి లోతెంతో తెలిసింది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా తమ వ్యాపారంలో 15-16 శాతాన్ని మొండి బకాయిలుగా చూపించాయి. ఇది ఒకరకంగా ఆయా బ్యాంకులు మునిగిపోయే పరిస్థితే!! ఇవి కొన్ని నిర్ణయాలు మాత్రమే. కాకపోతే అన్నింటా సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర బాగా తగ్గటం మోదీ సర్కారుకు కలిసొచ్చింది. కీలక రంగాలకు నిధులు మిగిలాయి.
 
దేశ వృద్ధిని లెక్కగట్టేందుకు అనుసరిస్తున్న ప్రామాణిక సంవత్సరాన్ని మార్చడం వల్ల కావొచ్చు.. మరో కారణం కావొచ్చు.. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7 శాతానికి పైగా నమోదవుతోంది. ఈ క్రమంలో పలు ప్రపంచవ్యాప్త పరిణామాలు కూడా మోదీకి బాగానే కలిసొచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనంతో దేశీయంగాను ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పుంజుకున్నాయి. కరెంటు అకౌంటు, ద్రవ్య పరిస్థితులు మెరుగయ్యాయి. రైల్వే, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడంతో... ఆయా రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. వీటి ఊతంతో 2014 మార్చి ఆఖరుతో పోలిస్తే విదేశీ మారక నిల్వలు ఏకంగా 47 బిలియన్ డాలర్ల మేర పెరిగి గతేడాది డిసెంబర్ నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. ఇవి దాదాపు ఎనిమిది నెలల దిగుమతుల బిల్లులకు సరిపోతాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్దేశించిన దానికన్నా ఇవి దాదాపు మూడు రెట్లు అధికం.
 
మేకిన్ ఇండియా.. స్టార్టప్ ఇండియా..
రెడ్ టేపిజాన్ని త గ్గించడంపై దృష్టి పెట్టడం ద్వారా.. సులభంగా వ్యాపారాలు చేయగలిగే దేశాల జాబితాలో మన ర్యాంకింగ్‌ను మోదీ మెరుగుపర్చే ప్రయత్నం చేశారు.  దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేలా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దీనికింద దాదాపు 400 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కూడా సాకారమైతే.. గడిచిన 14 ఏళ్లుగా దేశంలోకి వచ్చిన పెట్టుబడులను మించుతాయి. అలాగే చిన్న సంస్థలకు తోడ్పాటునిచ్చేలా స్టార్టప్ ఇండియాను సైతం ప్రధాని ప్రవేశపెట్టారు.
 
బ్యాంకింగ్‌కు మొండిబకాయిల భారం..  
అందరినీ బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తెచ్చే దిశగా జనధన యోజన, పెన్షన్ ప్రయోజనాలు దక్కేలా అటల్ పెన్షన్ యోజన వంటివి మోదీ ఆవిష్కరించారు. జనధన యోజన కింద దాదాపు 22 కోట్ల పైగా ఖాతాలు తెరవగా.. వాటిల్లో సుమారు రూ.37 వేల కోట్ల పైచిలుకు బ్యాలెన్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లాభాలు చూపించేందుకు ఏళ్ల తరబడి మొండి బకాయిల్ని దాస్తూ వస్తున్న బ్యాంకుల్ని ప్రక్షాళన చేసేందుకు ఆర్‌బీఐ నడుం బిగించింది. ఈ దెబ్బకు బ్యాంకులు ప్రకటించిన స్థూల మొండి బకాయీలు ఏకంగా రూ.4 లక్షల కోట్లు దాటిపోయాయి. ప్రభుత్వం బ్యాంకులకు ఆర్థికంగా కొంత మద్దతిస్తున్నా... కొన్నిటి పరిస్థితి మాత్రం దారుణంగా తయారయింది.
 
 
వ్యాపారం సెంటిమెంటు డౌన్..!
కొన్ని విజయాలున్నప్పటికీ... మోదీ ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసేలా మోదీ చేతుల్లో మంత్రదండం లాంటిదేమీ లేదన్న సంగతి మెల్లగా వ్యాపారవర్గాలకు కూడా అవగతమవుతోంది. వివిధ కారణాల వల్ల జీఎస్‌టీ బిల్లు నిలిచిపోయింది. ఇక విదేశీ ఇన్వెస్టర్లకు తలనొప్పిగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌ని ఎత్తివేస్తామన్నా... గతంలో ఇచ్చిన నోటీసులు ఇప్పటికీ వాళ్లను వెంటాడుతున్నాయి. ఎగుమతులు బలహీనంగానే ఉన్నాయి. బ్యాంకుల మొండి బకాయీలు 14 ఏళ్ల గరిష్టానికి ఎగిశాయి. గడిచిన రెండేళ్లుగా చూస్తే వ్యాపారస్తుల సెంటిమెంటు క్రమంగా తగ్గింది. సేవలు, నిర్మాణం, వ్యవసాయం, ఇతరత్రా రంగాల పనితీరును సూచించే ఎంఎన్‌ఐ బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్ సూచీ క్షీణతే దీనికి నిదర్శనం.

మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు.. అంటే 2014 మేలో సుమారు 80.3 పాయింట్లుగా ఉన్న ఈ సూచీ సెప్టెంబర్ నాటికి మరింత పెరిగింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 69.6కి తగ్గిపోయింది. ఇక ఆర్‌బీఐ 2016-17కి గాను రూపొందించిన పారిశ్రామిక అంచనాల సర్వేలో... పరిశ్రమ వర్గాల ఆశలు గడిచిన రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ  స్థాయికి పడిపోయాయి. ఉత్పత్తి సామర్ధ్య వినియోగం కూడా 2013-14 మూడో త్రైమాసికంలో 73 శాతం పైగా ఉంటే.. ఇటీవలి క్యూ3లో 72 శాతానికి తగ్గింది. తరచి చూస్తే పారిశ్రామికోత్పత్తి సింగిల్ డిజిట్ స్థాయిలోను, ఎగుమతులు రెండంకెల శాతం స్థాయిలోనూ క్షీణించగా, కంపెనీల ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో భారత జీడీపీ 7 శాతం పైగా ఎలా వృద్ధి చెందుతుందో తమకు బోధపడటం లేదంటూ డాయిష్ బ్యాంక్ ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు కూడా.
 
 
 అచ్చే దిన్ మార్కెట్లకు రాలేదు!
 నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలతో 2014 మే నుంచి స్టాక్ మార్కెట్ దూసుకెళ్లటం మొదలైంది. కాకపోతే ఆ మెరుపులన్నీ మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యాయి. రెండేళ్లు గడిచినా పరిస్థితి మారలేదు. ఒక్క దివాలా బిల్లు మినహా కీలక బిల్లులేవీ చట్టాలుగా మారలేదు. అందరికీ ఏమో కానీ స్టాక్ మార్కెట్‌కు మాత్రం అచ్చే దిన్(మంచి రోజులు) రాలేదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఇపుడు స్టాక్ మార్కెట్ కొంతైనా పుంజుకుందంటే అది అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కుదుటపడటం, ముడి చమురు ధరలు పుంజుకోవడం, సంస్థాగత రికవరీ... ఇత్యాది అంశాల వల్లనేనన్నది మార్కెట్ విశ్లేషకుల మాట. కమోడిటీ ధరలు క్షీణించడంతో ఈ రెండేళ్లలో లోహ షేర్లు దారుణంగా పడిపోయాయి. మొండి బకాయిల భారంతో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. ఇక మోదీకి సన్నిహితులనదగ్గ వారిలో అదానీ, అంబానీలు ముఖ్యులు. చిత్రంగా మోదీ రెండో ఏడాది పాలనలో వీరి కంపెనీల షేర్లు కుదేలై మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా తగ్గింది. ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ కూడా బాగానే క్షీణించింది. ఆ వివరాల సమాహారమే ఇది...
 
మోదీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చూస్తే, అంబానీ, అదానీ, జిందాల్,అనిల్ అగర్వాల్ వేదాంత... ఈ దిగ్గజ గ్రూప్‌ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 51 శాతం వరకూ క్షీణించింది. కమోడిటీ ధరలు తగ్గడం, కీలక సంస్కరణలు లేకపోవడం, కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండడం దీనికి కారణాలని చెప్పొచ్చు. 2014, మే 26న రూ.1,17,388 కోట్లుగా ఉన్న గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపుగా సగం పడిపోయి రూ.60 వేల కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ దాదాపు 25 శాతం పడిపోయింది. కమోడిటీ కంపెనీల విషయానికొస్తే, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 14 శాతం, జిందాల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 30 శాతం, అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ మార్కెట్ క్యాప్ 40 శాతం చొప్పున పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా తగ్గినప్పటికీ, ఆ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. ఈ రెండేళ్లలో లోహ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికం షేర్లు బాగా నష్టపోయాయి. అంబానీ సోదరుల షేర్లు కుదేలయ్యాయి.
 
 
 విదేశాంగం.. విజయవంతం!
 మోదీ విదేశీ విధానం.. దాని ఫలితాలు, పరిణామాలు
 రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అత్యంత ఆశావహ దృక్పథంతో మొదలైన భార త విదేశీ విధానం తనదైన విశిష్ట విజయాన్ని ఇటీవలే నమోదు చేసుకుంది. దశాబ్ద కాలంపైగా ఊరిస్తూ వచ్చిన భారత్-ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం ఈ సోమవారమే సఫలీకృతమైంది. ఈ ఒప్పందంతో భారత్ ఇంధన అవసరాలకు అత్యంత సురక్షితమైన మార్గాన్ని కనుగొనడంతో పాటు పాకిస్తాన్, చైనా వ్యూహాత్మక సంబంధాలకు చెక్ పెట్టగలిగారు. ఇరాన్‌లోని చబహర్ నౌకాశ్రయ తొలి దశ అభివృద్ధికి సంబంధించి ఇరుదేశాల మధ్య కుదిరిన  ఒప్పందంతో దీర్ఘకాలంగా వాయిదాలో ఉన్న చమురులైన్‌ని సుసాధ్యం చేయడమే కాదు అటు తూర్పు యూరప్, ఇటు అఫ్ఘానిస్తాన్‌తో సంబంధాలను కొత్తపుంతలు తొక్కించారు. పాక్‌తో సంబంధం లేకుండా అఫ్ఘాన్, మధ్యాసియా దేశాలకు నేరుగా రవాణాపై భారత్ కంటున్న చిరకాల స్వప్నం ఈ ఒప్పందంతో సాకారమైంది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో మోదీ తీసుకువచ్చిన మార్పులను పరిశీలిద్దాం.
 
 సానుకూల అంశాలు
  పొరుగు వారిని ముందుగా పలకరించడం అనేది నరేంద్రమోదీ ప్రధానిగా తీసుకున్న ప్రారంభ చొరవల్లో ఒకటి. దీంట్లో భాగంగా భారత్ సాధించిన పెద్ద విజయం బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న భూ సరిహద్దు ఒడంబడిక. ఇరు దేశాల మధ్య గత 40 ఏళ్లుగా వాయిదాలో ఉన్న ఈ వివాదం పరిష్కారమవడంతో భారత్-బంగ్లా సంబంధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అలాగే శ్రీలంకతో దశాబ్దాలుగా దెబ్బతింటూ వచ్చిన సంబంధాలు 2015 ప్రారంభంలో మెరుగుపడ్డాయి. మహీంద రాజపక్సే స్థానంలో మైత్రిపాల సిరిసేన శ్రీలంక అధ్యక్షుడైన వెంటనే 2015 మార్చిలో మోదీ ఆ దే శంలో పర్యటించారు. గత 30 ఏళ్లలో భారత ప్రధాని శ్రీలంకలో అడుగుపెట్టడం అదే తొలిసారి.
 
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, క్లీన్ గంగా, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు విదేశాల్లో ప్రచారం కల్పించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాత్మకంగా వ్యవహరించారు.

2015లో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం... ఒబామా, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వంటి ప్రపంచ నేతలతో మోదీ కుదుర్చుకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం భారత ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయాయి. జపాన్‌తో కుదిరిన పౌర అణు సహకార ఒప్పందం, 15 బిలియన్ డాలర్ల వ్యయంతో జపాన్ సహాయంతో దేశంలో నిర్మించనున్న హైస్పీడ్ రైల్వే లైన్ అనేవి ఆర్థికపరమైన సంబంధాన్ని కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి. భారత ప్రయోజనాలను ఇన్నాళ్లూ అడ్డుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియాతో పౌర అణు ఒప్పందం కుదరటం కూడా విశేషమనే చెప్పాలి.

‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ పేరిట ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో విస్తరించిన సంబంధాలు భారత్‌కు భారీ ప్రయోజనాలనే తెచ్చిపెట్టాయి. ఈ ఒక్క పరిణామంతో ప్రపంచ ఆర్థిక గమ్యం ఆసియావైపు అడుగేసింది. కౌలాలంపూర్, సింగపూర్ లలో మోదీ జరిపిన ఫలప్రదమైన పర్యటనలు ఈ విషయంలో విశేషంగా భారత్‌కు తోడ్పడ్డాయి.

ఇక చైనా విషయానికి వస్తే భారత ప్రయోజనాలతో ముడిపడిన వ్యవహారాల్లో చైనా రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా చొచ్చుకురావడం ఇప్పటికీ సవాలుగానే ఉంటోంది. భారత్ తన భూభాగమని చెప్పుకుంటున్న ప్రాంతంలో 64 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మాణమవుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ చైనా-భారత్ సంబంధాలను మరింతగా పలచబారుస్తోంది. అయితే భారత ప్రాధమ్యాలను గురించి మోదీ చైనా నేతలతో నిష్కర్షగా చర్చించారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడితో తనదైన సాన్నిహిత్యాన్ని నెలకొల్పుకోవడంలో మోదీ చొరవ ప్రదర్శించారు.

ప్రవాస భారతీయుల సంస్థాగత పటిమను, నిర్మాణ కౌశలాలను ప్రపంచానికీ చాటిచెప్పిన తొలి ప్రధాని మోదీయే. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రవాస భారతీయులు అత్యంత సంపన్నశ్రేణి గా గుర్తింపు పొందారు. ఆ దేశాల రాజకీయాలను కూడా వీరు ప్రభావితం చేస్తూ వస్తున్నారు. మోదీ పర్యటనలతో తొలిసారిగా ప్రవాస భారతీయుల ప్రభావం ప్రపంచం ముందు ప్రదర్శితమైంది. ఆ దేశాల్లో మోదీ పర్యటన, చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి.

యూపీఏ ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోని దేశాల్లోనూ మోదీ పర్యటించారు. యూపీఏనే కాదు.. భారత ప్రధానమంత్రులు గత 20 లేదా 30 సంవత్సరాలుగా పర్యటించని దేశాలనూ మోదీ చుట్టేశారు. ప్రధానిగా రెండేళ్ల పాలనలో మోదీ విదేశీ విధానం అత్యంత సానుకూల అంశాలను నమోదు చేసింది.
 
  ప్రతికూలతలు

 ఇన్ని విజయాల మధ్యనే మోదీ విదేశీ విధానం కొన్ని దేశాలకు సంబంధించి స్తంభనకు గురయిందనే చెప్పాలి, ముఖ్యంగా నేపాల్ విషయంలో మోదీ ప్రభుత్వం కూడా యూపీఏ విదేశీ విధానాన్ని దాటి అణుమాత్రం ముందుకు సాగలేకపోయింది. నేపాల్ నూతన రాజ్యాంగ ఆవిష్కరణ నేపథ్యంలో జరిగిన పరిణామాలు భారత్-నేపాల్ మధ్య సంబంధాలను దెబ్బతీశాయి.
 
అదేవిధంగా పాకిస్తాన్ కు మోదీ అందించిన అరుదైన స్నేహహస్తాన్ని కూడా ఆ దేశం అందుకోలేకపోయింది. పాక్‌తో చర్చల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన భారత్ దౌత్యపరంగా పొందిన వైఫల్యంగానే దీన్ని భావించాలి.
 దౌత్యపరమైన విజయాలు
  ఒకే సంవత్సరం అంటే 2015లో మోదీ పర్యటించిన దేశాల సంఖ్య 28. ఏ భారత ప్రధానీ ఈ ఘనత సాధించలేదు.
  ఒకే ఏడాది 12 దేశాల అధినేతలకు స్వదేశంలో స్వాగతం పలకడం కూడా మోదీకే చెల్లింది. వారిలో - అమెరికా, జర్మనీ వంటి అతి శక్తివంతమైన దేశాధినేతలతో పాటు శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, భూటాన్ వంటి పొరుగు దేశాల అధినేతలూ ఉన్నారు.
  జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలతో పౌర అణు సహకారం ఒప్పందం కుదుర్చుకున్నారు.
  అమెరికా మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకున్నారు.
  ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో భారత్ సంబంధాల విస్తరణ ప్రపంచ ఆర్థిక రంగాన్నే ఆసియా వైపుకు మళ్లించింది.
  ఆఫ్రికా సదస్సుకు భారత్ వేదికై నిలిచింది. దాదాపు 41మంది ఆఫ్రికన్ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
  ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా ఐక్యరాజ్యసమితి గుర్తించడం మోదీ వ్యక్తిగత విజయాల్లో ఒకటి.
  అయిదు మధ్య ఆసియాదేశాలలో ప్రధాని వరుస పర్యటనలు భారత్ పట్ల ఆ దేశాల దృ క్పథంలో గణనీయ మార్పును తీసుకొచ్చాయి.
  ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వంపై భారత్ డిమాండ్‌కు అత్యధిక స్థాయిలో గుర్తింపు లభించింది.
  చిరకాల మిత్రదేశం రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలకు మోదీ వ్యక్తిగతంగా కృషి చేశారు.
  భారత్‌కు ఇంధన వనరుల శాశ్వత సరఫరా విషయంలో ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు.

 కొంచెం తీపి.. కొంచెం చేదు
 ఎన్డీఏ రెండేళ్ల పాలనలో హామీల అమలు తీరు
 2014 లోక్‌సభ ఎన్నికల  సందర్భంగా బీజేపీ హామీలు సామాన్యుడితో పాటు మధ్య తరగతి వర్గాన్ని ఆకట్టుకున్నాయి. అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతానికి పట్టం కడతామంటూ ఓటర్లను ఆకట్టుకున్నారు. యువతకు కోట్లాది ఉద్యోగాలతో పాటు, పాలన లో సాంకేతికతకు పెద్దపీట వేసిప్రజల్ని భాగస్వాముల్ని చేస్తామని, అవినీతి అంతు చూస్తామంటూ హామీలు గుప్పించారు. పూర్తిగా మోదీ మార్కుతో సాగిన ఈ మేనిఫెస్టో ఎంత వరకు అమలైందో ఒకసారి పరిశీలిస్తే..
 
ధరల నియంత్రణ, ద్రవ్యోల్బణం కట్టడి
 ధరలకు ముకుతాడు వేసి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొస్తామన్న హామీ మేనిఫెస్టోలో ప్రధానమైంది. నల్లబజారు, అక్రమ నిల్వల అంతు చూసేందుకు ప్రత్యేక కోర్టులు,  ధరల స్థిరీకరణ నిధితో దేశమంతా ఒకే జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు. వ్యవసాయ, మార్కెట్ సమాచారం క్షణాల్లో అందరికీ చేరేలా సాంకేతికతను వినియోగించుకోవడం.  
 అమలు: హామీకి విరుద్ధంగా ఏడాది కాలంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పప్పుదినుసులు కిలో రూ.200కు చేరడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి. అక్రమ నిల్వలకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు లేవు.
 
 పారిశ్రామికవేత్తలకు చేయూత
 యువతకు భారీగా ఉద్యోగాలతో పాటు జౌత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాకారం అందిస్తామంటూ యువ ఓటర్లను ఆకట్టుకున్నారు.ఉత్పత్తి రంగంలో కార్మికుల ప్రాధాన్యం పెరిగేలా చర్యలు. సంప్రదాయ రంగాలైన వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి, గృహనిర్మాణంలో ఉద్యోగ అవకాశాల పెంపు. స్వయం ఉపాధికి చేయూత.
 అమలు: ‘మేకిన్ ఇండియా’లో ఉద్యోగాల కల్పనతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చేయూత. ప్రోత్సాహకాలతో కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆహ్వానం. ‘స్కిల్ ఇండియా’లో యువత నైపుణ్యాల్ని పెంచేందుకు చర్యలు. అసంఘటిత రంగ కార్మికులకు అటల్ పెన్షన్ యోజన.
 
 అవినీతి అంతం
 అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ-గవర్నెన్స్ పాలన. అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన, లక్ష్యాల మేరకు పనిచేసేలా దిశానిర్దేశం.
 అమలు: రెండేళ్ల మోదీ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి నిర్మూలన కోసం ఈ- పాలనకు అధిక ప్రాధాన్యం. అవినీతి కేసులపై విచారణ వేగవంతం.
 
 నల్లధనం వెనక్కితేవడం

 విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కితేవడం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
 అమలు: నల్లధనంపై ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినా... ఇప్పటి వరకూ చర్యలు నామమాత్రమే. నల్లధనం జాబితా ప్రకటనకు వెన కడుగు
 
 ఈ గవర్నెన్స్
 ఈ -పాలన, సమాచార సాంకేతికతతో సాధికారత సాధించడం. దేశమంతా బ్రాండ్‌బ్యాండ్ సేవలు. సాంకేతికత సాయంతో గ్రామీణ, చిన్నస్థాయి పట్టణాల్లో ఈ-గవర్నెన్స్, ఐటీ ఆధారిత ఉద్యోగాల కల్పన.  
అమలు: 1, జులై 2015న ‘డిజిటల్ ఇండియా’కు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.  ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాలనపై అవగాహనకు చర్యలు.
 
  గ్రామీణ, పట్టణ అభివృద్ధి
 వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం. గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులైన రోడ్లు, రక్షిత మంచినీరు, విద్య, వైద్యం, పౌర సరఫరా, విద్యుత్ సదుపాయాలతో పాటు ఉద్యోగ కల్పన. పట్టణాభివృద్ధి కూడా ప్రాధాన్యం. వంద కొత్త నగరాల నిర్మాణానికి చర్యలు.  రవాణా, గృణ నిర్మాణ రంగంపై ఎక్కువ దృష్టిపెట్టడం.
 అమలు: 2016 బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు అధిక కేటాయింపులు. జన్‌ధన్‌యోజనలో 21.74 కోట్ల బ్యాంకు ఖాతాలు. 100 స్మార్ట్ సిటీల ప్రకటన. తొలి జాబితాలో 32 నగరాల ఎంపిక. స్మార్ట్ సిటీల కోసం బడ్జెట్లో రూ.7,060 కోట్లు కేటాయింపు.
 

మరిన్ని వార్తలు