రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’

5 Oct, 2018 11:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : ‘బంగ్లాదేశ్‌ వలసదారులు చెద పురుగులు. వందకోట్ల మంది చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించారు. వారంతా చెదపురుగుల్లా దేశాన్ని తింటున్నారు. ఢిల్లీలో అక్రమ వలసదారుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదా? వారిని బయటకు విసిరి పడేయాలా, వద్దా?’ అంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్‌లో జరిగిన పలు పార్టీ ర్యాలీల్లో ఆవేశంగా మాట్లాడారు. భారత దేశంలో నేటి జనాభా దాదాపు 127 కోట్లు. వారిలో వంద కోట్ల మంది వలసదారులే అయితే మిగతా 27 కోట్ల మంది మాత్రమే అసలైన భారతీయులా?

రోహింగ్యాల సమస్యకు అదే కారణం...
ఆ విషయాన్ని పక్కన పెడితే ఓ జాతిని ఇతర జాతీయులపైకి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టిన పర్యవసానంగానే నేడు రోహింగ్యా ముస్లింల సంక్షోభ సమస్య అటు మయన్మార్‌ను, ఇటు భారత్, బంగ్లాదేశ్‌లను వేధిస్తోంది. బౌద్ధ జాతీయవాద ఉద్యమానికి చెందిన బౌద్ధ మత గురువు ఆషిన్‌ విరత్తు, రోహింగ్య ముస్లింలను చీడ పురుగులు, పిచ్చి కుక్కలని పదే పదే పిలవడం వల్ల, మనం బలహీనులమైతే రేపు మనదేశమంతా ముస్లింలే ఉంటారంటూ మయన్మార్‌ హిందువులను రెచ్చ గొట్టిన ఫలితంగా ఆ దేశంలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఇరువర్గాలకు చెందిన వారు వేల సంఖ్యలో మరణించారు. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది రోహింగ్య ముస్లింలు బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోకి, దాదాపు లక్ష మంది భారత్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించారు.
 
ఇటీవల కొంత మంది దేశాధినేతలు ఇలాంటి అమానుష, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే గ్రీస్, ఇజ్రాయెల్, అమెరికా, హంగరి, ఉక్రెయిన్, నైజీరియా దేశాల్లో అల్లర్లు చెలరేగి వేలాది మంది మరణించారు. ఓ జాతి మరో జాతి పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించకుండా అమానవీయంగా వ్యవహరించడంతో దార్వన్, కాంబోడియాల్లో జాతుల సంఘర్షణలు భగ్గుమన్నాయి. బాల్కన్‌ యుద్ధాలు అందుకే జరిగాయి. అలాగే రువాండలోని తుత్సీలను దూహించడం వల్ల వాళ్లకు, హుతూస్‌కు మధ్య జాతి సంఘర్షణలు చెలరేగుతున్నాయి. 1994లో తుత్సీలను బొద్దింకలంటూ రువాండ రేడియో విమర్శించడం జాతి వైషమ్యాలకు బీజం వేసిందని ‘డేంజరస్‌ స్పీచ్‌ ప్రాజెక్ట్‌’ను ఏర్పాటు చేసిన సుసాన్‌ బెనేష్‌ తెలిపారు.
 
15 లక్షల మంది మృతి..
ఆర్మేనియా మారణకాండ అందుకే జరిగింది. ‘అర్మేనియన్లు టర్కీలోని ముస్లిం సొసైటీకి సోకిన ఇన్‌ఫెక్షన్‌. ఆశ్రయమిచ్చిన దేశ ప్రజల ఎముకల మూలుగులను తొలుచుకుతింటున్న పరాన్నభుక్కులు’ అని ఓ వర్గం వారు రెచ్చగొట్టడంతో ఇరువర్గాల మధ్య ఈ మారణ హోమం చెలరేగింది. 2015, ఏప్రిల్‌ నెలలో ప్రారంభమై రెండేళ్లపాటు కొనసాగిన ఈ మారణ హోమంలో 15 లక్షల మంది ప్రజలు మరణించారు. మారణ హోమం సందర్భంగా దొంగతనాలు, దోపిడీలే కాకుండా విచ్ఛల విడిగా మహిళలపై అత్యాచారాలు కొనసాగాయి. 

ఎన్నికలు ముగిసే వరకు అమిత్‌షా తీరు అదేనా..?
ఇలాంటి మారణహోమాలు ఒక్కసారి చేసే ప్రసంగాల వల్ల తలెత్తుతాయన్నద కాదు. పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల జరుగుతాయి. అమిత్‌ షా తీరు చూస్తుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ ఎన్నికలు ముగిసే వరకు ఇలాగే మాట్లాడేటట్లు కనిపిస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక్క రోజు ముందు మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మాట్లాడుతూ ‘లెవలింగ్‌ ది గ్రౌండ్‌’ అంటూ ఆవేశంగా ఇచ్చిన ప్రసంగం ఒక వర్గాన్ని ఎంతో రెచ్చగొట్టింది. 

>
మరిన్ని వార్తలు