గుళ్లోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి దుర్మరణం

4 Mar, 2018 12:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచీ : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి దూసుకెళ్లటంతో ఏడుగురు మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. జంషెడ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలో చియాబస పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

శనివారం రాత్రి చియాబాసా-ఛాకర్దార్‌ హైవేపై బరోడా బ్రిడ్జి వద్ద ఉన్న ఓ గుడిలో రెండు గిరిజన కుటుంబాలు వివాహ వేడుకల కోసం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

నిందితుడు పారిపోయేందుకు యత్నించగా.. స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ బస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ అగర్వాల్‌ కొడుకు అని దర్యాప్తులో తేలింది. దీంతో ప్రతిపక్షాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శశి భూషణ్‌ క్షతగాత్రులను పరామర్శించి.. ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. 

కాగా, కొద్దిరోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బీజేపీ నేత మనోజ్‌ బైతా ర్యాష్‌ డ్రైవింగ్‌తో స్కూల్లోకి దూసుకెళ్లగా.. 9 మంది చిన్నారులను మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు