పందులను ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం

5 Dec, 2015 08:53 IST|Sakshi
పందులను ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం

సరిగ్గా రన్‌వే మీద దిగబోతుండగా.. అడవి పందులు అడ్డు రావడంతో వాటిని ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం ఒకటి దారుణంగా దెబ్బతింది. 49 మంది ప్రయాణికులతో కూడిన ఈ విమానం జబల్‌పూర్‌లోని డుమ్నా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రన్‌వే మీద నుంచి విమానం పక్కకు వెళ్లిపోతున్నా, దాన్ని పైలట్ ఎలాగోలా నియంత్రించగలిగారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు.

కెప్టెన్ అమర్త్య బసుకు 10 వేల గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉందని, ఆయనవల్లే భారీ ప్రమాదం తప్పిందని స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 49 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, విమానానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని తెలిపారు.  ముంబై నుంచి జబల్‌పూర్ వస్తున్న ఈ విమానం ల్యాండ్ అవుతుండగా అడవిపందుల గుంపు ఒకేసారి రన్‌వే మీదకు వచ్చేసిందని, దాంతో విమానం రన్‌వే నుంచి పక్కకు దిగిపోయిందని తెలిపారు. కొన్ని అడవిపందులు ఈ ప్రమాదంలో చనిపోయాయి. రాత్రిపూట కావడం, విమానాశ్రయం సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్‌కు రంధ్రం ఉండటంతో అడవిపందులు లోపలకు వచ్చేశాయని చెబుతున్నారు. ఇంతకుముందు 2014 నవంబర్ నెలలో సూరత్ విమానాశ్రయం రన్‌వే మీద స్పైస్ జెట్ విమానం ఓ గేదెను ఢీకొంది.

మరిన్ని వార్తలు