కళ తప్పిన ఓనం

26 Aug, 2018 03:35 IST|Sakshi
కొచ్చిలోని ఓ సహాయక కేంద్రంలో ఓనం సందర్భంగా ముగ్గులు వేస్తున్న మహిళలు

వరదలతో నిస్తేజంగా కేరళ సంప్రదాయ పండగ

ఈ నెల 8 నుంచి వరదలకు 293 మంది మృత్యువాత

తిరువనంతపురం: అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఓనం వేడుకలతో కేరళ సందడిగా ఉండేది. తీవ్ర వరద విపత్తు కారణంగా శనివారం జరిగిన రాష్ట్ర సంప్రదాయ పండగ పూర్తిగా కళ తప్పింది. ఇంకా చాలా మంది బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండటం, వేలల్లో ఇళ్లు ధ్వంసం కావడంతో పండుగ శోభ కనిపించలేదు. ప్రకృతి ప్రకోపంతో గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చేందుకు పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, మసీదులు, చర్చీల్లోనే కొందరు ఓనం విందులను ఏర్పాటుచేశారు. సంప్రదాయ పూల తివాచీలు పరచి బాధితుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కష్టకాలాన్ని అధిగమించేలా కేరళ ప్రజలకు ఓనం కొత్త శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

ఇలాంటి ఓనం ఊహించలేదు
‘కొత్తగా కట్టుకున్న మా ఇంట్లో మరోసారి ఓనం జరుపుకోలేమని అసలు ఊహించలేదు. ఈరోజు(శనివారం) తిరు ఓనం. కానీ మేము ఇంకా సహాయక శిబిరంలోనే ఉన్నాం. వర్షాలు, వరదలు మా ఇంటిని నేలమట్టం చేశాయి’ అని 82 ఏళ్ల కుమారి అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్క కుమారే కాదు హఠాత్తు వరదలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన సుమారు 8 లక్షల మందిదీ ఇదే బాధ, ఇదే వ్యధ. అలప్పుజాలోని ఓ మసీదులో సాదాసీదాగా నిర్వహించిన ఓనం వేడుకల్లో సంప్రదాయ మలయాళ వంటకాలు అవియాల్, పాయసం, సాంబార్‌లను తయారుచేసి అక్కడ  బాధితులకు వడ్డించారు.

మృతుల సంఖ్య 293:
ఈ నెల 8 నుంచి కేరళ వరదల్లో 293 మంది మృతిచెందగా, 36 మంది జాడతెలియకుండా పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరాశ్రయుల కోసం పునరావాస కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపింది. 26 ఏళ్ల తరువాత తొలిసారి గేట్లు ఎత్తి నీటిని విడుదలచేసిన ఇడుక్కి డ్యాం సమీప ప్రాంతాల్లో అత్యధికంగా 51 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. త్రిసూర్‌లో 43 మంది, ఎర్నాకులంలో 38 మంది, అలప్పుజాలో 34 మంది చనిపోయారు. మలప్పురంలో 30 మంది మరణించారు. 2,287 సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న సుమారు 8.69 లక్షల మంది ఇప్పుడిప్పుడే సొంతిళ్లకు చేరుకుంటున్నారు. సీఆర్‌పీఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పునరావాస కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. సహాయక చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి విజయన్‌కు వైమానిక దళం రూ.20 కోట్ల చెక్కు అందించింది.

మరిన్ని వార్తలు