గూఢచర్యం డొంక కదిలిందిలా..

23 Feb, 2015 02:51 IST|Sakshi

 జిరాక్స్ మిషన్ వద్ద కీలక డాక్యుమెంట్‌ను
 వదిలేసి వెళ్లిన ‘ఇంటి దొంగలు’
     ఏడు గదుల తాళాలకు డూప్లికేట్ తాళం చెవుల తయారీ
     వాటి సాయంతో రాత్రిపూట కార్యాలయాల్లోకి వెళ్లి డాక్యుమెంట్ల చోరీ
     ఎనిమిది నెలల నుంచే సాగుతున్న ఫైళ్ల తరలింపు
     ఓరోజు డెరైక్టర్ గది తలుపు తెరచి ఉండడంతో అప్రమత్తమైన అధికారులు
     పోలీసుల రంగ ప్రవేశంతో రట్టయిన గుట్టు
 న్యూఢిల్లీ: సంచలనం రేపుతున్న కార్పొరేట్ గూఢచర్యం ఎలా బయటపడింది..? జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక ఫైళ్లు సైతం కార్యాలయాలను దాటి ఎలా బయటకు వెళ్లాయి..? చమురు శాఖలో ఎప్పట్నుంచి ఈ చీకటి తతంగం సాగుతోంది..? ఇదేదో వారం కిందట బయటపడ్డ ఉదంతం కాదు! దీని వెనుక పక్కా స్కెచ్ ఉందని, కొద్ది నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఫైళ్ల తరలింపు సాగుతోందని తెలుస్తోంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట.. అంటే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన తర్వాత చమురు శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల ఆధారంగా తీగ లాగితే ఈ డొంక కదిలింది. శాస్త్రిభవన్‌లోని చమురుశాఖ కార్యాలయంలో గతేడాది జూన్‌లో ఓరోజు ఉదయం జిరాక్స్ మిషన్ వద్ద ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి పడి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. కీలకమైన పత్రం ఇక్కడికి ఎలా వచ్చిందని అధికారులు దానిపై దృష్టి సారించారు. కిందిస్థాయి సిబ్బంది ఎవరైనా ఈ చర్యలకు పాల్పడుతుండొచ్చని అనుమానించిన అధికారులు అప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. చివరకు టాయిలెట్లకు వెళ్లినా తమ గదులకు తాళం వేసి వెళ్లేవారు. ఇదిలా ఉండగా, రెండు నెలల కిందట ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. సాధారణంగా అర్ధరాత్రిపూట తమ పనులు చక్కబెట్టుకునే నిందితులు.. ఈసారి వేకువజామునే తమ ‘ఆపరేషన్’ పూర్తి చేశారు. ఉదయం పూట ఆఫీసు శుభ్రపరిచే సిబ్బంది తమ పనులు చేసుకుంటుండగా.. ఓ డెరైక్టర్ గది తలుపు తెరచి ఉండడాన్ని గమనించి ఉన్నతాధికారులకు చెప్పారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. కార్యాలయాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచింది. పోలీసులు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గత గురువారం ఢిల్లీ పోలీసులు రహస్య పత్రాలను తరలిస్తున్న కొందరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో గుట్టు రట్టయింది.
 ‘కీ’లకమైన ఫైళ్లు వెళ్లాయిలా..!
 డూప్లికేట్ తాళం చెవులతో కార్యాలయాల తలుపులు తెరచి రాత్రిపూట చిన్నచిన్న కారిడార్‌లు, ఇరుకు మార్గాల గుండా రహస్య పత్రాలను తరలించేవారని పోలీసుల దర్యాప్తులో తేలడం ఈ స్కాంలో మరో కోణం. నిందితులు ఏకంగా ఏడు గదుల డూప్లికేట్ తాళం చెవులను తయారుచేశారు. కీలకమైన ప్రత్యేక కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులతోపాటు చమురు అన్వేషణా విధానం, పెట్రోలియం, గ్యాస్ ధరల అంశాలను పర్యవేక్షించే కొందరు డెరైక్టర్ల గదుల తాళాలకు డూప్లికేట్ ‘కీ’లు రూపొందించడం గమనార్హం. వరుసగా అనుమానాస్పద ఘటనలు వెలుగుచూడడంతో అప్పట్నుంచి అధికారులు కార్యాలయంలోని అన్ని గదుల తాళాలను మార్చారు. కీలకమైన ఫైళ్ల కదలికలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. రహస్య ఫైళ్లు, డాక్యుమెంట్లను నేరుగా వెళ్లి అందజేయడం, లేదా సీల్డ్ కవర్‌లో పంపడంలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు చమురుశాఖ కార్యదర్శి సౌరబ్ చంద్ర తెలిపారు. చమురుశాఖకు జైపాల్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ‘మల్టీ-టాస్కింగ్ స్టాఫ్’లో పనిచేసిన ఆశారాం(58), ఆయన సహచరుడు ఈశ్వర్‌సింగ్(56) ఈ డూప్లికేట్ ‘కీ’లను తయారు చేసినట్లు తెలుస్తోంది. రాత్రిపూట నకిలీ ఐడీ కార్డులు, నకిలీ తాళంచెవులతో ఉన్నతాధికారుల గదుల్లోకి వెళ్లడం, అవసరమైన పత్రాలను జిరాక్స్ తీసి, వాటిని చమురు కన్సల్టెంట్లు, కార్పొరేట్‌లకు అందించేవారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు చమురుశాఖ సిబ్బంది సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్, కైర్న్, రిలయన్స్ గ్రూప్‌లకు చెందిన మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతుండడం తెలిసిందే.
 కాగా ఈ కేసులో అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం శాస్త్రిభవన్‌కు తీసుకువెళ్లారు. కార్యాలయాల నుంచి రహస్య పత్రాలు ఎలా తీసకువెళ్లేవారో వారి ద్వారా తెలుసుకున్నారు. కొన్ని సాక్ష్యాలను సేకరించి, వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు.
 మొద్దుబారిపోయిన వ్యవస్థకు నిదర్శనం
 మొద్దుబారిపోయిన అధికార వ్యవస్థ, కీలక ఫైళ్ల నిర్వహణలో దారుణమైన నిర్లక్ష్యానికి కార్పొరేట్ గూఢచర్యం కేసు ఓ నిదర్శనమని కొందరు మాజీ ఉన్నతాధికారులు విమర్శిస్తున్నారు. రహస్య డాక్యుమెంట్ల విషయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. రక్షణ, పెట్రోలియం వంటి శాఖల రహస్య ఫైళ్లను పకడ్బందీగా నిర్వహించడంతోపాటు ఆ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకులపై గట్టి నిఘా ఉండాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సూచించారు.  
 ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాన్
 కార్పొరేట్ గూఢచర్యంపై దర్యాప్తు ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకొని చేయడం లేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంచేశారు. ‘మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై మేం ఫిర్యాదు చేశాం. దర్యాప్తు జరుగుతోంది. వ్యవస్థను భ్రష్టుపట్టించాలని చూసినవారు ఎవరైనా వదలబోం. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. చట్టాలను ఉల్లంఘించిన ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు