నిరసన జ్వాల

2 Aug, 2014 00:51 IST|Sakshi
నిరసన జ్వాల

- శ్రీలంక వెబ్‌సైట్లో అమ్మపై అనుచిత కార్టూన్
- అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన
- క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంక వెబ్‌సైట్లో జయలలితను అవమానిస్తూ ఒక కార్టూన్‌ను పొందుపరిచారు. అందులో జయలలిత, ప్రధాని మోడీకి రాసే లేఖలను, ప్రేమ లేఖలుగా వర్ణించడంపై తమిళనాట నిరసన జ్వాలలు రేగారుు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మలను తగులబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలోని దౌత్య కార్యాలయూన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది.

టీ.నగర్: శ్రీలంక సైనిక వెబ్‌సైట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచే విధంగా ఒక కార్టూన్ చిత్రం విడుదలైంది. దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు తెలిపారు. నుంగంబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోగా వారు లయోలా కళాశాల సమీపంలో ఆందోళనకు దిగారు. ఆ తరువాత శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు మూడు గంటల సేపు వాహన రాకపోకలు స్తంభించాయి.

నుంగంబాక్కంలో అన్నాడీఎంకే నేత ఆధ్వర్యం లో అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు, శ్రీలంక చర్యలకు నిరసనగా ఆందోళన జరిపారు. శ్రీలంక ప్రభు త్వ భద్రతా శాఖకు విడిగా ఒక వెబ్‌సైట్ ఉంది. భద్రతా శాఖ కార్యదర్శిగా శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్సే సోదరుడు కోత్తప్పయే ఉన్నారు. ఈయన పర్యవేక్షణ కింద పని చేసే ఈ వెబ్‌సైట్లో ముఖ్యమంత్రి జయలలిత  వైఖరికి వ్యతిరేకంగా ఒక వ్యాసం విడుదలైంది. శ్రీలంక రచయిత ఒకరు జయలలిత రాష్ట్ర జాలర్ల సమస్య గురించి ప్రధాని మోడీకి లేఖలు రాయడాన్ని విమర్శించారు.

ఇందులో జయలలిత అనవసరంగా లేఖలు రాస్తున్నారని, దీంతో మోడీకి మాత్రమే సమస్యలు ఏర్పడుతున్నాయని, మోడీజయలలిత ఆదేశాల మేరకు నడుచుకోరని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాసాలకు శ్రీలంక ప్రభుత్వం బాధ్యత వహించదని పేర్కొన్నప్పటికీ ఆ వ్యాసానికి సంబంధించి జయలలిత మోడీకి రాస్తున్న లేఖను ప్రేమలేఖను రాస్తున్నట్లు చిత్రించి అవమానించార ని చెప్పారు.

ఈ చర్య రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నేతలు దీనిపై నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో వైగో, రాందాసు, పళ నెడుమారన్ ఉన్నారు. వ్యాపార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెల్లయ్యన్ ఈ చర్యను ఖండిస్తూ రాజపక్సే దిష్టిబొమ్మను తగలబెట్టనున్నట్లు ప్రకటించారు.
 
శ్రీలంక క్షమాపణ
జయలలితను కించపరిచే విధంగా శ్రీలంక సైనిక వెబ్‌సైట్‌లో కార్టూన్ విడుదల చేయడం పట్ల శ్రీలంక ప్రభుత్వం జయలలితకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు తెలిపింది. 

>
మరిన్ని వార్తలు