సన్నిధానంలో శ్రీలంక మహిళ

5 Jan, 2019 04:35 IST|Sakshi
ఇరుముడితో శశికళ

గురువారం అర్ధరాత్రి అయ్యప్పకు పూజలు

దీనిపై సీఎం ఆఫీసు, భక్తురాలి భిన్న వాదనలు

బోర్డు సభ్యుడి ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి  

శబరిమల: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. దేవస్థానం బోర్డు సభ్యుడి ఇంటితో పాటు మరికొన్నిచోట్ల ఆందోళనకారులు పెట్రోల్‌ బాంబులు విసిరి అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామిని శ్రీలంకకు చెందిన శశికళ(47) అనే మహిళ దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి శశికళ గుడిలోకి చేరుకుని పూజలు నిర్వహించినట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది.

భర్త శరవణ్, కుమారుడు దర్శన్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారని వెల్లడించింది. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారన్న వాదనల్ని శశికళ ఖండించారు. తాను స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆలయానికి రాకముందు తాను 41 రోజుల వ్రతం పాటించానని వెల్లడించారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘పోలీస్‌ అధికారులు నన్ను ఎందుకు అనుమతించలేదు? మీరంతా(మీడియా) నా చుట్టూ ఎందుకు నిలబడ్డారు? నేను ఎవరికీ భయపడను’ అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కుమారుడితో కలిసి తాను మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని శశికళ భర్త శరవణ్‌ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా కారణాలతోనే శశికళ అలా చెప్పి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయ్యప్పస్వామి దర్శనానికి శుక్రవారం శబరిమల వచ్చిన కయాల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ను భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వెనక్కి పంపారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి నిరసనగా కొందరు దుండగులు శుక్రవారం తెల్లవారుజామున మలబార్‌ దేవస్థానం బోర్డు సభ్యులు కె.శశికుమార్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబు విసిరి పరారయ్యారు. అలాగే పతనంతిట్ట ప్రాంతంలోని ఓ మొబైల్‌ షాపుపై పెట్రోల్‌బాంబు దాడి జరిగింది.

200 మంది అరెస్ట్‌!
సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా చెలరేగుతున్న కన్నూర్‌లో 200 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో 801 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 1,369 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. పాలక్కడ్‌తో పాటు కసర్‌గోడ్‌ జిల్లా మంజేశ్వరమ్‌లో నిషేధాజ్ఞలు విధించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు