శ్రీలంక యువతి రక్షింపు

12 Mar, 2020 08:53 IST|Sakshi

తిరువొత్తియూరు: ఫేస్‌బుక్‌ ప్రియుడితో చెన్నైలో ఉంటున్న శ్రీలంక యువతిని పోలీసులు రక్షించారు. శ్రీలంక రత్నపుర జిల్లా సమకిపురారాజ్‌వార్‌ తాలూకాకు చెందిన జైనుల్లాబుద్ధీన్‌ కుమార్తె రిషేవి ఫాతిమా గుప్త (21). బన్రూట్టి సమీపం వి.ఆండికుప్పం గ్రామానికి చెందిన మహ్మద్‌ ముబారక్‌ (25) చెన్నైలో ఉన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రిష్‌వి ఫాతిమాగుప్త గత నెల 26వ తేదీ పర్యాటక వీసాపై చెన్నైకి వచ్చారు. (ఎల్లలు దాటిన ఫేస్‌బుక్‌ ప్రేమ)

తరువాత బన్రూట్టికి వెళ్లి ప్రియుడితో కలిసినట్టు తెలిసింది. ఈ లోపు కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుసుకున్న జైనుల్లా ఆగ్రహం చెంది అత్యవసరంగా దుబాయ్‌ నుంచి చెన్నైకి వచ్చాడు. తరువాత కడలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ శ్రీఅభినవ్‌ వద్ద తన కుమార్తెను విడిపించాలని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బన్రూట్టి పోలీసు ఇన్‌స్పెక్టర షణ్ముగం నేతృత్వంలో రిష్‌వి ఫాతిమా గుప్త కోసం గాలించారు. ఆమె చెన్నైలో ఉంటున్నట్టు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు రిష్‌వి ఫాతిమా గుప్తాను ప్రియుడి వద్ద నుంచి విడిపించారు. ప్రియుడిని బన్రూట్టికి పిలిపించి విచారణ చేస్తున్నారు. శ్రీలంక యువతి మేజర్‌ కావడంతో ఆమె ప్రియుడితో వివాహం చేయిస్తారా? శ్రీలంకకు పంపిస్తారా..?  తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు