‘మేమేం రేప్‌లు, మర్డర్‌లు చేయలేదు’

13 Mar, 2018 11:26 IST|Sakshi
నాడు పబ్‌ బయట నమోదైన దాడి దృశ్యాలు... పక్కన ప్రమోద్‌ ముథాలిక్‌

సాక్షి, మంగళూరు : దాదాపు 9 ఏళ్ల వాదనల తర్వాత మంగళూర్‌ పబ్‌ దాడి కేసులో నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేనందున వారిని విడుదల చేస్తున్నట్లు సోమవారం జేఎంఎఫ్‌సీ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శ్రీ రామ్‌ సేన అధినేత ప్రమోద్‌ ముథాలిక్‌, కార్యకర్తలకు ఉపశమనం కలిగింది.  తీర్పు అనంతరం బయటకు వచ్చిన ప్రమోద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న విషయమని తెలిపారు.

‘మేమేం రేప్‌లు, మర్డర్‌లు చేయలేదు. ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా కొందరు భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపాలనుకున్నారు. జమ్ము కశ్మీర్‌ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయంటూ అసందర్భ ప్రేలాపనలు చేశారు. పెద్ద పెద్ద నేరాలు చేస్తున్న వాళ్లే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఏ తప్పు చెయ్యలేదు. చివరకు ధర్మం గెలిచింది’ అంటూ ప్రమోద్‌ వ్యాఖ్యానించారు. 

కాగా, మహిళలని కూడా చూడకుండా పబ్‌ నుంచి బయటకు లాకొచ్చి మరీ నిర్దాక్షిణ్యంగా దాడి చేశారన్నది వీరందరిపై నమోదైన ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ప్రమోద్‌తోపాటు 30 మంది శ్రీ రామ్‌ సేన కార్యకర్తలపై కేసు నమోదు అయ్యింది. తొమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు వారందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ పార్టీపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ముథాలిక్‌ తెలిపారు.

మంగళూర్‌ పబ్‌ దాడి కేసు...
2009, జనవరి 24వ తేదీన మంగళూర్‌లోని అమ్నేషియా పబ్‌లో పార్టీ చేసుకుంటున్న యువతపై శ్రీ రామ్‌ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పక్కదోవ పట్టిస్తూ పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో ఉన్న వాళ్లందరినీ బయటకు లాక్కొచ్చి మరీ తరిమి కొట్టారు. అయితే మహిళలను కూడా జుట్టు పట్టుకుని విసిరేస్తూ దాడులు చేయటం.. ఆ వీడియోలు వైరల్‌ కావటంతో దేశ్యాప్తంగా ఘటన చర్చనీయాంశంగా మారింది. జాతీయ మహిళా కమిషన్‌ జోక్యంతో కేసు దాఖలు కాగా.. శ్రీ రామ్‌ సేన అధినేత ప్రమోద్‌ ముథాలిక్, ఆయన అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. 30 మందిలో 25 మంది నిందితులుగా కోర్టు విచారణను ఎదుర్కోగా.. ముగ్గురు విదేశాలకు పారిపోయారు. మరో ఇద్దరు కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ప్రాణాలు విడిచారు.

మరిన్ని వార్తలు