శ్రీదేవి అంత్యక్రియలపై...

31 Mar, 2018 17:17 IST|Sakshi

సాక్షి, ముంబై : లెజెండరీ నటి శ్రీదేవి అంత్యక్రియల విషయంలో నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని తెలిపారు. 

అనిల్‌ గల్గాలి అనే ఉద్యమవేత్త రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగానికి(సీఏడీ) ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. ఏ ప్రతిపాదికన ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని అందులో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ‘శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 25న అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అందులో ఉంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ముంబై సబ్‌ అర్బన్‌ కలెక్టర్, పోలీసు కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. పైగా పద్మ అవార్డు గ్రహీతలకు(శ్రీదేవికి పద్మశ్రీ దక్కింది) గౌరవ లాంఛనాలతో నిర్వహించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి’ అని లేఖలో ప్రస్తావించింది. 

ఇక గత ఆరేళ్లలో మొత్తం 41 మందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. అందులో మాజీ సీఎం విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌, ఏ ఆర్‌ అంతులే, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాక్రే తదితరుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆమె గొప్ప నటే కావొచ్చు. అయినా జాతీయ పతాకాన్ని కప్పేంతగా ఆమె దేశానికి ఏం చేశారు? అని ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ థ్రాకే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు