ఎక్కడున్నా ఆగస్టు 13న తిరుపతికే!

28 Feb, 2018 01:57 IST|Sakshi

పుట్టినరోజున శ్రీవారి సన్నిధికి శ్రీదేవి

తాతగారి ఇల్లు ఇక్కడే

తల్లి, పిన్ని, మేనమామల బాల్యం ఇక్కడే

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి ఊరన్నా, తిరుమల వెంకన్న దర్శనమన్నా సినీనటి శ్రీదేవికి ఎంతో ఇష్టం. బాల్యాన్ని గుర్తు చేసేది ఊరైతే, కోర్కెలు తీర్చేది వెంకన్న దేవుడు. అందుకే తన పుట్టిన రోజున (ఆగస్టు 13) ఎక్కడున్నా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు శ్రీదేవి. ఇది మాత్రమే కాదు.. ఇక్కడున్న తీర్థకట్ట వీధిలోని ఇంటి నెంబరు–93కి మరో ప్రాధాన్యత ఉంది. శ్రీదేవి తాతగారిల్లు ఇదే. ఆయన పేరు వెంకటస్వామిరెడ్డి. ప్రైవేటు బస్సులు ఆపరేట్‌ చేసుకునే ఆయన నర్సుగా పనిచేసే వెంకట రత్నమ్మను వివాహమాడారు. వీళ్లిద్దరూ ఈ ఇంట్లోనే ఉన్నారు. వీరికి శ్రీదేవి తల్లి రాజేశ్వరితో పాటు మరో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. వీళ్లంతా ఇక్కడే పెరిగారు. దీన్నిబట్టి శ్రీదేవి కుటుంబ మూలాలు ఇక్కడే మొదలయ్యాయని అర్థమవుతోంది.

ఇల్లంటే ఎంతో ఇష్టమట..
తిరుపతిలోని తాత గారిల్లంటే శ్రీదేవికి ఎంతో మమకారం. ఈ ఇంటిని చూస్తే తన బాల్యం, అప్పట్లో తనతో గడిపిన మిత్రులు గుర్తుకొస్తారని చెప్పేది. పాతబడ్డ ఇంటిని పడగొట్టి మళ్లీ కొత్త ఇల్లు కట్టుకోవడం.. అదే సమయంలో శ్రీదేవి సినిమాల్లో బిజీ అవడంతో ఇక్కడకు రాకపోకలు ఆగిపోయాయి. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి తిరుమలకు చేరుకోవడం.. దర్శనం అయ్యాక హోటల్‌కు బంధువుల్ని పిలిపించుకుని వారితో మాట్లాడ్డం జరిగేది. తెలుగు భాష పెద్దగా రాని శ్రీదేవి భర్త బోనీకపూర్‌.. తిరుపతిలో బంధువులు కలిసినపుడు ‘నమస్తే’ చెప్పడం మినహా పెద్దగా మాట్లాడేవారు కాదని ఇక్కడున్న శ్రీదేవి బంధువులు చెబుతున్నారు.

ఎవర్నీ అనుమానించలేం..
శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని మంగళవారం మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ఉన్న ఆమె బాబాయ్‌ మారపురెడ్డి వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. ‘ఎవర్నీ అనుమానించలేం. బోనీకపూర్‌పై మంచి అభిప్రాయమే ఉంది మాకు. మాకు తెల్సినంత వరకూ శ్రీదేవి అందరితోనూ బాగానే ఉంటుంది. అయితే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని విన్నాం. అంతమాత్రాన ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. ఏదేమైనా మా ఇంటి పిల్ల దూరమైంది. అదే బాధగా ఉంది. ఈ ఇల్లు కట్టేటపుడు అడిగి మరీ మద్రాసు నుంచి మార్బుల్స్‌ పంపింది. వాటినే ఫ్లోరింగ్‌కు వేశాం’ అంటూ వేణుగోపాలరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.

అందరూ అనిల్‌ ఇంట్లోనే..
తిరుపతి నుంచి ముంబై చేరుకున్న శ్రీదేవి బంధువులందరూ బోనీకపూర్‌ సోదరుడు అనిల్‌కపూర్‌ ఇంట్లోనే బసచేశారు. తాజ్‌ హోటల్‌లో మరో ఆరు గదులు తీసుకున్నారు. చెన్నై, మధురై, బెంగళూరు, న్యూజిలాండ్‌ల నుంచి ముంబై చేరుకున్న బంధువులందరికీ శ్రీదేవి సొంత చెల్లెలు శ్రీలత బస ఏర్పాట్లు చేశారు. ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య దగ్గరుండి అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.  

మరిన్ని వార్తలు