భారత్ ఓటమితో శ్రీనగర్ నిట్ మూసివేత!

2 Apr, 2016 15:22 IST|Sakshi
భారత్ ఓటమితో శ్రీనగర్ నిట్ మూసివేత!

శ్రీనగర్: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి శ్రీనగర్ లో సెగలు పుట్టిస్తోంది. విద్యార్థుల మధ్య మ్యాచ్ ఓటమి విషయంలో మొదలైన గొడవలు ఇంకా అలాగే ఉన్నాయి. సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ తలెత్తింది. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో, స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ గొడవ ఉధృతం అవుతున్న నేపథ్యంలో కాలేజీ తరగతులను తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలని మేనేజ్‌మెంట్ సూచించిందంటే పరిస్థితి ఏంటన్నది అర్థమవుతోంది.

కాలేజీ క్లాసులు నిర్వహించాలా వద్దా అనే అంశంపై మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది. సోమవారం కాలేజీ రీఓపెన్ చేయాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామని నిట్ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఫయాజ్ మిర్ తెలిపారు. విద్యార్థుల మధ్య గొడవ తీవ్రతరం కాకుండా ఉండేందుకు స్థానిక విద్యార్థులను ఇళ్లకు వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన గొడవలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థన చేసిన తర్వాత స్థానికేతర విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేశారని మీడియాకు వివరించారు.

మరిన్ని వార్తలు