ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు..

4 Aug, 2019 15:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్ నిట్‌కి సెలవులు ప్రకటించడంతో.. తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. 31మంది నిట్‌ తెలుగు విద్యార్థులు తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వీరిని ఏపీ భవన్‌ రెసిడెంట్ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిసీవ్ చేసుకున్నారు. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. ఢిల్లీ నుంచి తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తరలేందుకు ఏపీ భవన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి జమ్మూ నుంచి బయల్దేరారు. నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)కు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో నిట్‌ విద్యార్థులు స్వరాష్ట్రాలకు పయనమయ్యారు. కాలేజీ యాజమాన్యం కూడా నాలుగు బస్సులు ఏర్పాటుచేసి విద్యార్థులను శ్రీనగర్‌ నుంచి జమ్మూ తరలించింది. అక్కడి నుంచి తెలుగు విద్యార్థులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ఢిల్లీలోని ఏపీ భవన్‌ తగిన చర్యలు చేపట్టింది. ఇక, గతరాత్రి 23మంది నిట్‌ తెలుగు విద్యార్థులు జమ్మూ అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ బయల్దేరారు. మరో 86మంది ప్రత్యేక రైలులో జమ్ము నుంచి ఢిల్లీకి వస్తున్నారు. సోమవారం కల్లా విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకుంటారని ఏపీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది: తెలుగు విద్యార్థులు
ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా తెలుగు విద్యార్థులు సాక్షి టీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని, తక్షణమే స్పందించి తమ ప్రయాణానికి వీలుగా ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. రైలులో ప్రత్యేకంగా రెండు బోగీలు ఏర్పాటు చేసి జమ్మూ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని, ప్రయాణంలో తమకు భోజన సదుపాయం కల్పించారని విద్యార్థులు తెలిపారు. కశ్మీర్‌లో ప్రస్తుతానికి సాధారణ పరిస్థితులు ఉన్నాయని, 15 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టు తమ కాలేజీ యాజమాన్యం తెలిపిందని విద్యార్థులు వివరించారు. ఆగస్టు 15 కల్లా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్టికల్ 35ఏ రద్దు చేస్తారనే ప్రచారం కశ్మీర్‌లో జరుగుతోందని, ఆర్టికల్ 35 ఏ అనేది ఏకైక గుర్తింపని అక్కడి తోటి స్టూడెంట్స్ చెబుతున్నారని, దీనిని రద్దు చేస్తే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం కనబడుతోందని, ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఇతర రాష్ట్ర విద్యార్థులందరినీ పంపించివేస్తున్నారని చెప్పారు. వీలైతే కశ్మీర్ నిట్‌లోని తెలుగు విద్యార్థులను జమ్మూ నిట్‌కి బదిలీ చేయాలని కోరుతున్నామని, కశ్మీర్‌లో పదే పదే ఇటువంటి పరిస్థితుల వల్ల తమ చదువులకు అంతరాయం కలుగుతోందని అన్నారు. కశ్మీర్‌లోని తమ నిట్‌ క్యాంపస్‌ను ఆర్మీ బేస్ క్యాంపుగా మారుస్తున్నారని తెలిసిందని, అందుకే మమ్మల్ని అక్కడి నుంచి త్వరగా ఖాళీ చేయించి పంపారని తెలిపారు. మళ్లీ తిరిగి ఎప్పుడు రావాలి అనే దానిపై మెయిల్ ద్వారా మళ్లీ సమాచారం ఇస్తామని యాజమాన్యం చెప్పిందని, ప్రస్తుతానికి కశ్మీర్‌లో ఇంటర్నెట్‌, ఫోన్ సేవలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు