దళితుల హత్యపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

26 Oct, 2014 01:54 IST|Sakshi
దళితుల హత్యపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశం
సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలోని జావ్‌ఖేడ గ్రామంలో ఇటీవల ముగ్గురు దళితులు హత్యకు గురైన ఘటనపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శనివారం రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ దయాల్‌ను ఆదేశించారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. ఈ విషయమై గవర్నర్ డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. త్వరలోనే ఈ అంశమై రాజ్‌భవన్‌లో ఆర్పీఐ (ఏ) డెలిగేషన్ నాయకులతో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇలాంటి సంఘటనలను మున్ముందు సహించేది లేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3.75 లక్షల నష్టపరిహారం చెల్లించాలని గవర్నర్ సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల విషయమై త్వరలోనే విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఇదిలా వుండగా ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఆధ్వర్యంలో  ఆ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు శనివారం గవర్నర్‌ను కలిసి దళితుల హత్యపై సీఐడీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చోటుచేసుకొని దాదాపు నాలుగు రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టులు చేయలేదని ఆరోపించారు.

ముగ్గురు దళితులు (సంజయ్ జాధవ్, జయశ్రీ జాధవ్, సునీల్ జాధవ్)లను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆఠవలే డిమాండ్ చేశారు. అహ్మద్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం ఇది దళితులపై జరిగిన నాలుగవ అతి పెద్ద ఘటనగా రాందాస్ పేర్కొన్నారు. అహ్మద్‌నగర్ జిల్లాను  ఎట్రాసిటీ-ప్రోన్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబానికి రూ.15 లక్షల నష్ట పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు