హరిత గ్రామ కథ 

9 Sep, 2018 02:02 IST|Sakshi

రియల్‌ ఎస్టేట్‌కు ‘నో’ చెప్పిన సెయింట్‌ ఎస్తేవం

మండోవి నది మధ్య ఉందీసెయింట్‌ ఎస్తేవం. ఉత్తర గోవాలోని ఆ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. పొట్టకొచ్చిన వరి పైరు ఇప్పుడు ఆ ఊరికి సరికొత్త శోభనిస్తోంది. చర్చి ఫాదర్‌ ప్రభాత ప్రవచనాల్లో పంట చేల తాలూకూ తాజా విశేషాల్ని భాగం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరి పంట పండబోతోంది.అక్టోబర్‌లో వరి పంట చేతికి రాబోతోంది. మరి ఇన్నాళ్లూ పంటలకు వారు ఎందుకు దూరంగా ఉన్నట్లు? 

రియల్‌ ఎస్టేట్‌ వద్దు.. 
రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ కారణంగా గోవాలో వరి సాగు బాగా క్షీణించింది. సెయింట్‌ ఎస్తేవం అంతటా బీడు భూములే. ఊళ్లో సగం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. లేదంటే ఓడల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక కుటుంబాలకు (నిన్న మొన్నటి వరకు) తమ పొలాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఆ భూములకు వారు మూడో తరం వారసులు. తమ చిన్న చిన్న కమతాలను వదిలేస్తే అవి ‘రియల్‌’ వ్యాపారుల పరమవుతాయనే భయం వారిని ఆలోచింపచేసింది. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే హరిత గ్రామ సంఘం (గ్రీన్‌ విలేజ్‌ క్లబ్‌) ప్రాజెక్టు. సమష్టి వ్యవసాయ ఆలోచన. ఊరి జనం ఈ ప్రాజెక్టుకు మొదట అంగీకరించలేదు. భూములు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. జనవరిలో జరిగిన మొదటి సమావేశంలో వ్యవసాయదారులు, భూ యజమానులు సమష్టి వ్యవసాయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత కొంత కాలానికి చర్చలు జరిగాయి. చివరికి సంసిద్ధత వ్యక్తమైంది. భూ సమీకరణ మొదలైంది. 50 హెక్టార్లలో వరి వేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులకు అనువైన గోవా ధన్‌–1 రకాన్ని సాగు చేస్తున్నారు. 175 మెట్రిక్‌ టన్నుల పంట చేతికి రావొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి ఊళ్లో ఉన్న మొత్తం 250 హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలని భావిస్తున్నారు. 

ఇంటింటికీ తిరిగారు.. 
ఈ గ్రామంలో నివసించేది ప్రధానంగా నావికులే. వారు వ్యవసాయం గురించి ఆలోచించేలా చేయడం పెద్ద సవాలు. ‘భూమి పత్రాలు, రికార్డులు వెతికి పట్టుకోండి. హక్కుదారులు ఎక్కడున్నారో విచారించండి’ అంటూ ఉదయం సమావేశాల్లో అక్కడి చర్చి ఫాదర్‌ యుసికో పెరీరా ప్రజలకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు ఓ బృందం గ్రామస్తులు, వారి భూముల వివరాలు సేకరించగలిగింది. అశ్విన్‌ వరేలా అనే 20 ఏళ్ల కుర్రాడు.. భూముల విషయంలో గ్రామస్తులకు చాలా సాయపడ్డాడు. ‘రాత్రి వేళల్లో ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి అన్ని రికార్డులూ డౌన్‌లోడ్‌ చేశాం. విషయాలు నిర్ధారించుకోవడం కోసం ప్రతి ఇంటికీ వెళ్లాం. సాయపడ్డాం. మేం తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టేవాళ్లం. విదేశాల్లో, ఓడల్లో ఉన్న వాళ్లను సంప్రదించేందుకు ఫేస్‌బుక్‌ వాడాం’ అని చెబుతున్నాడు అశ్విన్‌. గోవా వ్యాప్తంగా ఇలాంటి పరిణామం చేసుకోవడం ఇదే తొలిసారంటారు అగ్రికల్చర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ ప్రాజెక్టు హెడ్‌ సంజీవ్‌ మయేకర్‌. ఇప్పుడు గోవా మొత్తం సెయింట్‌ ఎస్తేవం వైపు ఆసక్తిగా చూస్తోంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయాలని భావిస్తోంది. 

అస్తిత్వ పోరాటంలో భాగమే..
తమ అస్తిత్వం, భాష, సంస్కృతి, పండుగలను కాపాడుకునేందుకు గోవావాసులు పోరాడుతున్నారనీ, సెయింట్‌ ఎస్తేవం పరిణామాల్ని ఈ కోణం నుంచే చూడాలని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దామోదర్‌ మౌజో చెబుతున్నారు. ‘వలసదారులను ఆహ్వానిస్తాం. కానీ ఈ భయం కూడా ఒక నిజం’ అంటారాయన. అనేక కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వదిలి, తిరిగి రాలేనంత దూరం వెళ్లిపోయాయి. వారు భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అవి వివాదాల్లో చిక్కుకోవచ్చు. లేదంటే కబ్జాకు గురై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతికి చిక్కొచ్చు. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఈ ప్రాజెక్టు అభినందించదగ్గదేనని మౌజో చెబుతున్నారు.

మరిన్ని వార్తలు