నేడు ఎన్‌ఆర్‌సీ తుది ముసాయిదా విడుదల

30 Jul, 2018 04:23 IST|Sakshi

అస్సాంలో తేలనున్న 2 కోట్ల మంది భవితవ్యం  

గువాహటి: అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేడు నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్‌ఆర్‌సీ) తుది ముసాయిదాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్‌గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. ఈ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని ఎన్‌ఆర్‌సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా తెలిపారు. 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తామన్నారు. అస్సాం ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో.. మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చింది. 

మరిన్ని వార్తలు