రాజాజీ హాల్‌లో తొక్కిసలాట.. ఇద్దరి మృతి

8 Aug, 2018 14:35 IST|Sakshi

సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. జనం రద్దీ పెరగడం, అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 40 మందికి పైగా గాయాలయ్యాయి.

ఈ సందర్భంగా డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా కార్యకర్తలు సహకరించాలని కోరారు. సీఎం పళనిస్వామిని కలసి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహిస్తామంటే సహకరించలేదని తెలిపారు. కోర్టు ద్వారా అనుమతులు సాధించామని పేర్కొన్న ఆయన దీనిని తమిళ ప్రజల విజయంగా అభివర్ణించారు.

4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమయాత్ర
సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.

మెరీనా బీచ్‌లో ఆర్మీ బలగాలు..
కరుణానిధి అంత్యక్రియలు జరగనున్న మెరీనా బీచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటుండటంతో అక్కడ భారీగా సైనిక బలగాలను మొహరించారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు