స్టార్‌ క్యాంపెయినర్‌ సిద్ధూకు ఫుల్‌ గిరాకీ!

1 Apr, 2019 16:20 IST|Sakshi

తమ రాష్ట్రాల్లో ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్న నేతలు

పంచ్‌ డైలాగులు, మోదీపై వ్యంగ్యాస్త్రాలతో ప్రచారంలో అలరిస్తున్న సిద్ధూ

సాక్షి, న్యూడిల్లీ: లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌గా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున సిద్ధూ స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించి.. కాంగ్రెస్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో మంచి వాగ్ధాటి ఉన్న సిద్ధూతో తమ రాష్ట్రాల్లో ప్రచారానికి పంపాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం కూడా సిద్ధూను ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీకి మంచి ఛరిష్మా, ప్రజాదరణ ఉండటంతో ఆమెతో యూపీతోపాటు ఉత్తరాఖండ్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

హిందీ రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్‌లోనూ ప్రచారం చేయాల్సిందిగా సిద్ధూను కాంగ్రెస్‌ పార్టీ కోరుతోంది. క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా, టీవీ యాంకర్‌గా ప్రసిద్ధుడైన సిద్ధూ మంచి వాగ్ధాటి గల నేత. పరిస్థితులకు తగ్గట్టూ ప్రత్యర్థులపై  పంచ్‌ డైలాగులు విసురుతూ.. ఆయన జనాన్ని ఆకట్టుకోగలరు. తన ప్రసంగశైలితో, డైలాగులతో హాస్యాన్ని పంచగలరు. దీంతోపాటు ప్రజలకు చక్కగా హిందీ అర్థమయ్యేలా మా​ట్లాడటంలో దిట్ట. దీంతో హిందీ రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయాలోనూ ఆయనకు స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా కట్టబెట్టాలని భావిస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ , రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై సిద్ధూ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. 

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ను కూడా పలు హిందీ రాష్ట్రాల్లో ప్రచారం చేయవల్సిందిగా కాంగ్రెస్‌ కోరుతోంది. యువ నాయకులైన రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జ్యోతిరాధిత్యా సింధియాలను కూడా స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారబరిలోకి కాంగ్రెస్‌ దింపనుంది. పైలట్‌ రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సింధియా తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ ప్రచారం చేయనున్నారు. ఇక, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కొన్ని లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసే అవకాశముంది. 

మరిన్ని వార్తలు