పీఎస్‌ఎల్‌వీ సీ–39కి నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

30 Aug, 2017 07:28 IST|Sakshi
పీఎస్‌ఎల్‌వీ సీ–39కి నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి గురువారం రాత్రి 7 గంటలకు ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం నిర్వహించిన మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌)లో అధికారికంగా ప్రకటించారు. షార్‌ కేంద్రంలోని బ్రహ్మ ప్రకాశ్‌ హాలులో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేశ్‌ ఆధ్వర్యంలో మిషన్‌ సంసిద్ధతా సమావేశం జరిగింది.

గురువారం సాయంత్రం 6.59 గంటలకు ప్రయోగం జరుగుతుందని తొలుత ప్రకటించారు. కానీ అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ పి.కున్హికృష్ణన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రయోగ సమయాన్ని మరో నిమిషం పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నానికి రాకెట్‌కు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ప్రయోగానికి 29 గంటల ముందు అంటే.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుంది. పీఎస్‌ఎల్‌వీ సీ–39 ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించనున్నారు. 
మరిన్ని వార్తలు