జాంఝాటానికి చెక్!

8 Jun, 2014 22:21 IST|Sakshi
జాంఝాటానికి చెక్!

సాక్షి, ముంబై: మెట్రోసేవలు అదివారం నుంచి అందుబాటులోకి రావడంతో వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు దూరంకానున్నాయి. ఈ  మార్గంలో ప్రయాణించే లక్షలాదిమంది ఇకపై మెట్రోరైల్లోనే ప్రయాణించే అవకాశం ఉండడంతో రోడ్డుమార్గంలో ట్రాఫిక్ ‘జాం’ఝాటం ఇకపై ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఏసీ సదుపాయంతోపాటు అత్యాధునిక సుదుపాయాలన్నీ ఈ రైళ్లలో అందుబాటులో ఉండడంతో విలాసవంతమైన కార్లలో ప్రయాణించేవారు కూడా ఇకపై మెట్రో రైలులోనే ప్రయాణించే అవకాశముందని, దీంతో రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందంటున్నారు.
 
వర్సో వా నుంచి ఘాట్కోపర్ వరకు ఇదివరకు ప్రయాణించాలంటే కనీసం రెండున్నర గంటల సమయం పట్టేది. అయితే ఆదివారం వర్సోవా స్టేషన్ నుంచి బయలుదేరిన మెట్రోరైలు కేవలం 21 నిమిషాల్లో గమ్యం చేరింది. దీంతో రెండుగంటలకు పైగా సమ యం ఆదా కావడం ఖాయమని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమయంతోపాటు ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. ప్రయాణ ఖర్చు కూడా తగ్గే అవకాశముంది.
 
సాకారమైన కల...
ముంబైకర్ల ఎనిమిది సంవత్సరాల కల ఎట్టకేలకు సాకారమైంది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్‌ల మధ్య నడిచే మెట్రో రైలును ఆదివారం ఉదయం 10.20 గంటలకు ముఖ్య మంత్రి పృథ్వీరాజ్ చవాన్ వర్సోవా స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం గణపతి బోప్పా మోరియా.....మంగళమూర్తి మోరి యా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మార్మోగుతున్న నినాదాల మధ్య కూత పెట్టిన మెట్రో రైలు మెల్లగా ముందుకు కదిలింది. మెట్రో రైలు పైలట్ క్యాబిన్‌లో సీఎం చవాన్‌తోపాటు ఈ ప్రాజెక్టు అధినేత అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీ ఉన్నారు.
 
మహిళకే మొదటి అవకాశం...
మొదటి మెట్రో రైలుకు సారథిగా వ్యవహరించే అవకాశం మహిళ పైలట్‌కు దక్కింది. వర్సోవా నుంచి ప్రారంభమైన తొలి రైలుకు ఓ మహిళా డ్రైవర్‌గా వ్యవహరించారు. ఆమె పక్కనే టీనా అంబానీ, అనిల్ అంబానీ, సీఎం చవాన్ తదితరులు నిల్చున్నారు. ఇక తొలి రైల్లో ప్రయాణించేందుకు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యు లు ఆసక్తి చూపారు.
 
దీంతో వారితో రైలు కిక్కిరిసి పోయిం ది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ 11.40 కి.మీ. దూరాన్ని కేవలం 21 నిమిషాల్లో పూర్తిచేసింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రయాణించేందుకు మిగతావారికి అనుమతించారు. దీంతో ముం బైకర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించేందుకు టికెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. పిల్లలు, పెద్దలు అందులో ప్రయాణించి ఆనందంతో కేరింతలు కొట్టారు.
 
ముస్తాబయిన వర్సోవా స్టేషన్...
వర్సోవా స్టేషన్ నుంచి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం అందగానే ఏర్పాట్లు పూర్తిచేశారు. స్టేషన్ ప్రముఖ ప్రవేశ ద్వారంతోపాటు ప్లాట్‌ఫారాలన్ని పూలతో అలంకరించారు. పచ్చ జెండా చూపే రైలును కూడా రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. ముందుగా ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకే వర్సోవా స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు. ఆ తరువాత 10.20 గంటలకు పచ్చ జెండా ఊపారు.
 
సుదీర్ఘ నిరీక్షణ...
2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఎమ్మెమ్మార్డీయే, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్రాన్స్‌కు చెందిన ఓలియా ట్రాన్స్‌పోర్ట్ సంస్థలురూ.2,356 కోట్ల సంయుక్తంగా భాగస్వామ్యంతో ప్రారంభించాయి. జాప్యం కారణంగా అది రూ.4,321 కోట్లకు చేరుకుంది. ఈ రైలు సేవలు ప్రారంభించేందుకు ఇచ్చిన డెడ్‌లైన్లు దాదాపు 11 సార్లు వాయిదా పడ్డాయి.
 
ఎట్టకేలకు ఆదివారం ప్రారంభం కావడంతో సుదీర్ఘ నిరీక్షణ ఫలించినట్లయింది. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న లోకల్ రైళ్లు, మార్చి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన మోనోతో పోలిస్తే మెట్రో ప్రయాణం భిన్నంగా ఉందని అందులో ప్రయాణించిన వారు అభిప్రాయపడ్డారు. మొత్తం బోగీలన్నింటిలో ఏసీ సౌకర్యం ఉండడంతో ఉక్కపోత, అలసట జాడే కనిపించలేదు. ఆటోమేటిక్ డోర్లు కావడంతో నడిచే రైల్లోనుంచి అదుపుతప్పి కిందపడే అవకాశాలు లేవు.
 
అత్యాధునిక సదుపాయాలు..
రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడితే ప్రయాణికులు నేరుగా పైలట్‌తో సంప్రదించే సదుపాయం ఉంది. ఒకవేళ పైలట్ ఆరోగ్యం క్షీణించినా...? లేదా సాంకేతిక లోపంతో రైలు మధ్యలో ఆగిపోయినా...? ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్ డి పోలోని కంట్రోల్ రూమ్ ద్వారా ఆగిపోయిన రైలును సమీపంలో ఉన్న స్టేషన్ వరకు తీసుకెళ్లే సౌకర్యం ఉంది. బోగీలలో అమర్చిన సీసీ కెమరాలపై పైలట్ నిఘా ఉంటుంది.
 
ప్రతి నాలుగు నిమిషాలకో రైలు..

ముంబైకర్ల రాకపోకలపై అధ్యయనం చేసి మెట్రోలో రైళ్ల ప్రిక్వెన్సీ నిర్ణయించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు.. ఇలా రద్దీ సమయంలో నాలుగు నిమిషాలకు ఒక రైలు, సాధారణ సమయంలో 10 నుంచి 15 నిమిషాలకు ఒక రైలుచొప్పున నడపనున్నారు.ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే రెండు రైళ్ల మధ్య ఉన్న సమయాన్ని మరింత తగ్గించనున్నారు.
 
ఉదయం 5.30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 16 మెట్రో రైళ్లు ఉండగా అవి ప్రతీరోజూ 270 నుంచి 287 వరకు ట్రిప్పులు తిరుగుతాయి. రద్దీ పెరిగితే ట్రిప్పుల సంఖ్య మరింత పెంచుతామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీ రైలుకు నాలుగు ఏసీ బోగీలు, బోగీకీ నాలుగు డోర్లు, ఒక్కో బోగీలో 50 మంది కూర్చుండే సదుపాయం ఉంది.
 
వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మార్గంలో 12 స్టేషన్లు ఉండగా మొత్తం 95 ఎస్కలేటర్లు, 45 ఎలివేటెడ్, 137 మెట్ల మార్గాలున్నాయి. అన్ని రైళ్లలో మొత్తం 100కుపైగా ఎల్‌సీడీ టీవీలు ఉన్నాయి. వీటిలో టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం లేదు. టికెట్ లేకుండా రైలు సమీపంలోకి కూడా వెళ్లలేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
 
ఆదిలోనే హంసపాదు..!
సాంకేతిక లోపంతో ఆగిపోయిన రైలు
సాక్షి, ముంబై: ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మెట్రోరైలు మొదటి ట్రిప్పులోనే సాంకేతిక లోపంతో దాదాపు అరగంట పాటు ఆగిపోయింది. దీంతో మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్ చేద్దామని ఎంతో సంతోషంతో రెలైక్కిన ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రైలును ప్రారంభించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, వారి బంధువులు వర్సోవా నుంచి అంధేరీ వరకు ప్రయాణించారు.
 
ఆ తరువాత అందరు దిగిపోయారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత నగరవాసులు ప్రయాణించేందుకు అనుమతినిచ్చా రు. దీంతో సేవలందించేందుకు ముందుకు వచ్చిన మెట్రో రైలులో ఎంతో సంతోషంతో అందరు ఎక్కారు. వర్సోవా నుంచి బాగానే ముందుకు కదిలిన రైలు జాగృతినగర్ స్టేషన్‌లో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. సుమారు అరగంట సేపు అక్కడే నిలి చిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొదటి ట్రిప్పులోనే ఇలా జరగడం ఏంటని ప్రశ్నించారు.
 
అప్పటికే కొందరు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఘటన రిలయన్స్ ఇన్‌ఫ్రా అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఇదిలాఉండగా తరుచూ ఏదో ఒక సాంకేతిక లోపంతో లోకల్ రైళ్లు నిలిచిపోవడం ముంైబె కర్లకు పరిపాటుగా మారింది. కాని మెట్రో రైళ్ల రాక వల్ల ఈ ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించారు. కాని ప్రారంభోత్సవం నాడే ఇలా రైలు ఆగిపోవడంతో వాటి పనితీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు