11 మందితో మొదలై 11 కోట్లకు..

6 Apr, 2016 14:17 IST|Sakshi
11 మందితో మొదలై 11 కోట్లకు..

న్యూఢిల్లీ: 'కేవలం 11 మందితో ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పుడు మన కుటుంబంలో 11 కోట్ల మంది సభ్యులున్నారు. జాతీయతే మన గుర్తింపు. అది లేకుంటే మనకు మనుగడే లేదు..' అంటూ బీజేపీ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అశోక్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీని ప్రపంచంలోనే ప్రముఖ నేతగా అభివర్ణించారు.

'తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూపై పాశ్చాత్య ప్రభావం తీవ్రంగా ఉండేది. అప్పుడే మన దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరాన్ని సంఘ్ పరివార్ గుర్తించింది. 1980, ఏప్రిల్ 6న భారతీయ జనతాపార్టీ(బీజేపీ)ని స్థాపించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగింది. జాతీయతే ఊపిరిగా పనిచేసే కార్యకర్తల త్యాగాలే బీజేపీ ఉన్నతికి కారణం. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుల్లో ఒకరు. ఆయన నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది' అని అమిత్ షా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు