విద్యారంగంపై రాష్ట్రాల నిర్లక్ష్యం

24 Jul, 2017 19:35 IST|Sakshi


న్యూఢిల్లీ:
'విద్య ప్రాథమిక హక్కు'ను దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నీరుగారుస్తున్నాయి. విద్యారంగం కేటాయింపుల్లో సగానికి సగం గండికొడుతున్నాయి. విద్యారంగాన్ని తరగతి గదులు, టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు విద్యారంగానికి సగం కేటాయింపులు కూడా సక్రమంగా జరపడం లేదు. ఫలితంగా బిహార్‌లో ప్రభుత్వరంగంలో నడిచే ఒకటి నుంచి 8వ తరగతి పాఠశాలల్లో 75 శాతం తరగతి గదుల కొరత ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు 7,91,614 మంది టీచర్లు అవసరం ఉండగా, వారిలో 47.2 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏడాదికి 18,029 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, 5,595 రూపాయలను మాత్రమే ఖర్చు చేస్తోంది. ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా విద్యార్థులపై అతి తక్కువ ఖర్చు చేస్తున్నాయి. 
 
ఢిల్లీలోని 'నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ'కి చెందిన పరిశోధకలు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగి ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో, అంటే బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడులలో విద్యారంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో పరిశీలించి ఓ నివేదికను రూపొందించారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే విద్యారంగానికి సగానికన్నా ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఢిల్లీ రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న తరగతి గదులకు మరో 25 శాతం తరగతి గదులు అవసరం కాగా, ఒడిశాలో 21.7 శాతం, రాజస్థాన్‌లో 15.55 శాతం తరగతి గదులు అవసరం.
 
ఇక అవసరమైన టీచర్లలో జార్ఖండ్‌లో 56. 4 శాతం, కర్ణాటకలో 68.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 67.7 శాతం మంది మాత్రమే టీచర్లు ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రతి విద్యార్థిపై ఏడాదికి 19,396 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా, 8,504 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఒడిశాలో విద్యార్థి 44.09 శాతం, ఢిల్లీలో 62.83 శాతం ఖర్చు చేస్తున్నారు. బీహార్‌లో 2015-16 విద్యాసంవత్సరానికి విద్యారంగంపై 41,261 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉండగా, 12,803 కోట్ల రూపాయలను, మధ్యప్రదేశ్‌లో 22,258 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉండగా, 11,502 కోట్ల రూపాయలను, జార్ఖండ్‌లో 10,202 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉండగా, 4,473 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేస్తున్నారు.
 
 
మరిన్ని వార్తలు