బీసీసీఐని తప్పుబట్టిన సీఎం!

10 Mar, 2016 20:06 IST|Sakshi
బీసీసీఐని తప్పుబట్టిన సీఎం!

సిమ్లా: భారత్-పాక్ మ్యాచ్ వేదిక అంశంపై ప్రతిరోజు ఏదో ఓ వార్త వస్తూనే ఉంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల19న దాయాదుల మధ్య పోరు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆ వెంటనే మేము ఇక్కడ భద్రత కల్పించలేము, ఇక్కడ మ్యాచ్ అనేది చాలాకష్టమని హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, బీసీసీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. నిన్న ఈ మ్యాచ్ వేధికను ధర్మశాల నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది. ఆ మరుసటి రోజు వీరభద్రసింగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు కూడా డబ్బులు అవసరమే కానీ పరిస్థితులు అనుకూలించలేదన్నారు.

దాయాదుల మ్యాచ్ కు సెక్యూరిటీ మేం అందించలేమని ఎప్పుడూ పేర్కొనలేదని సీఎం వీరభద్రసింగ్ మాటమార్చారు. అంతటితో ఆగకుండా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పై విమర్శలకు దిగారు. మ్యాచ్ వేదిక మారడానికి ఠాకూర్ ప్రధాన కారణమంటూ వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి, కార్గిల్ అమరవీరుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు మ్యాచ్ ఇక్కడ నిర్వహించవద్దని కోరినట్లు మాత్రమే తాను కేంద్రానికి తెలిపినట్లు వివరించాడు. గతంలో ఎన్నో మ్యాచ్ లను నిర్వహించాం అన్నారు. అయితే ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని మాత్రమే తాను పేర్కొన్నట్లు వీరభద్రసింగ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు