కరోనా పరీక్షలు : ఐసీఎంఆర్ కీలక నిర్ణయం

27 May, 2020 12:27 IST|Sakshi

రూ. 4500 నిబంధన తొలగింపు

ఇకపై ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే

గణనీయంగా తగ్గనున్న పరీక్షల ఖర్చు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. క‌రోనా వైర‌స్ సోకిందో లేదో నిర్ధారించే ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు ఇప్పటివరకు వసూలు చేస్తున్న రూ.4500 గరిష్ఠ నిబంధనను ఎత్తివేసింది. ఇకపై ఈ  చార్జీలు నిర్ణ‌యించే అధికారాన్ని రాష్ట్రాల‌కు అప్ప‌గిస్తూ ఐసీఎంఆర్ నిర్ణ‌యం తీసుకుంది  ఈ మేరకు  ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జనరల్ బ‌లరాం భార్గ‌వ  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాశారు. 

కోవిడ్-19 నిర్ధారణ కిట్లు బహిరంగ మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం వుందని   ఐసీఎంఆర్ తెలిపింది.  ఈ విషయంలో  ఆయా రాష్ట్రాలు, ప్రైవేట్ ల్యాబ్‌లు, సంస్థలు  పరస్పర అంగీకారంతో ధర నిర్ణయించుకోవచ్చని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఐసీఎంఆర్ పేర్కొంది. క‌రోనా నిర్ధారణ టెస్టుకు ఎంత చార్జ్  చేయాలి అనేది ఇప్పటివరకూ కేంద్ర ప‌రిధిలో ఉన్న అంశం. తాజా నిర్ణయంతో దీన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స‌వ‌రించుకునే వెసులుబాటు క‌ల్పించింది. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు )

ఐసీఎంఆర్ లేఖ ప్రకారం, దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు, 182 ప్రైవేట్ ల్యాబ్‌లు ఇందుకోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే మే 25 నాటికి ఐసీఎంఆర్ ఇప్పటికే 35 టెస్టింగ్ కిట్ల (విదేశీ,స్వదేశీ )ను ఆమోదించింది. అలాగే మే 26 నాటికి, రోజుకు లక్ష పరీక్షలు చొప్పున 31లక్షలను దాటినట్టు వెల్లడించింది. ఈ పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 2 లక్షల పరీక్షలకు పెంచాలని యోచిస్తోంది. కాగా ఈ సంవత్సరం మార్చి17 న, పరీక్షా కిట్ల లభ్యత  పరిమితంగా వుండటం, ప్రైవేట్ ల్యాబ్‌ల మోసాలను అరిట్టేందుకు ఒక్కో టెస్టుకు గరిష్టంగా రూ.4,500 మాత్రమే చార్జి చేయాలని నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు