కరోనా కట్టడి కోసం కొత్త వ్యూహాలు రచిస్తోన్న రాష్ట్రాలు

29 Jun, 2020 10:59 IST|Sakshi

ఆదివారం ఒక్క రోజే 19,906 కొత్త కేసులు

ఇంటింటి సర్వే.. లాక్‌డౌన్‌ దిశగా పలు రాష్ట్రాలు

లాక్‌డౌన్‌ నియమాలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే దేశంలో 19,906 కొత్త కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఆదివారం నాడు అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు 15 వేలకు పైగా పెరగడం వరుసగా ఇది ఐదవ రోజు. మృతుల సంఖ్య 16,095కు పెరిగింది. ఆదివారం ఉదయం వరకు నమోదైన 410 మరణాలలో మహారాష్ట్రలో 167, తమిళనాడులో 68, ఢిల్లీలో 66, ఉత్తరప్రదేశ్‌లో 19, గుజరాత్‌లో 18, పశ్చిమ బెంగాల్‌లో 13, రాజస్థాన్, కర్ణాటకలో 11, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది, హర్యానాలో ఏడు, పంజాబ్, తెలంగాణలో ఆరు, మధ్యప్రదేశ్‌లో నాలుగు, జమ్మూ కశ్మీర్‌లో రెండు, బిహార్, ఒడిశా, పుదుచ్చేరిలో ఒక్కొక్కటిగా ఉన్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించే యోచనలో ఉ‍న్నాయి. ఇప్పటికే తెలంగాణలో వైద్య అధికారులు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు రాష్ట్రాలు నూతన విధానాలను అమలు చేయనున్నాయి. 

ఇంటింటి సర్వే.. లాక్‌డౌన్‌
ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 5,28,859గా ఉండగా.. లక్షమందికి పైగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 58.56 శాతం ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌.1 అమల్లోకి రావడం.. ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫలితంగా జూన్‌ 1 నుంచి ఆదివారం(నిన్నటి) వరకు దేశవ్యాప్తంగా 3,38,324 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్‌లాక్‌ కాలంలోనే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నియమాలు పాటించడంలో అలసత్వం పనికిరాదని ప్రజలను హెచ్చరించారు. 

కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేసినవాళ్లం అవుతామన్నారు. ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘కరోనాను ఓడించడం.. దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రస్తుతం ప్రజలు దృష్టి సారించాల్సి ఉంది. మాస్క్‌ ధరించడం.. రెండు మీటర్ల దూరంతో పాటు ఇతర నిబంధనలను పాటించకపోతే.. మిమ్మల్ని, మీతో పాటు ఇతరులు.. ముఖ్యంగా మీ కుంటుంబంలోని వృద్ధులు, పిల్లలను ప్రమాదంలో పడేసిన వారు అవుతారు’ అని హెచ్చరించారు. కరోనా కట్టడి కోసం మధ్యప్రదేశ్‌, యూపీ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించగా.. గోవా, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నాయి. అస్సాం గువాహటిలో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. (హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌)

అన్‌లాక్‌ దిశగా మహారాష్ట్ర..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే  కరోనా సంక్షోభం ఇంకా ముగియకపోవడంతో జూన్ 30 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘నేను లాక్‌డౌన్ అనే పదాన్ని ఉపయోగించ లేదు. అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించటంలో అలసత్వం ప్రదర్శించవద్దు. వాస్తవానికి, మనం ఇప్పుడే మరింత కఠినమైన క్రమశిక్షణను చూపించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. ‘చివరి దశలో మనము ఈ యుద్ధాన్ని అర్ధాంతరంగా వదిలేయలేము. లాక్‌డౌన్ తిరిగి అమలు చేయకకుండా ఉండాలంటే మీరు ప్రభుత్వానికి సహకరిస్తూ ఉండాలి’ అని ఠాక్రే ప్రజలను కోరారు. అంతేకాక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ‘మిషన్ బిగిన్ ఎగైన్’ అనే అన్‌లాక్‌ ప్రక్రియ దశల వారిగా అమలు చేయబడుతుందని ఠాక్రే చెప్పారు.

అత్యధిక కరోనా కేసులు ఉన్న మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 5,493 నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోగుల సంఖ్య 1,64,626 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీసులకు, అత్యవసర వైద్య సేవలకు హాజరు కావడం తప్ప నగరవాసులు తమ ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్లు దాటి వెళ్లవద్దని పోలీసులు కోరారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షల సడలింపుతో పాటు సెలూన్లు తెరవడానికి ప్రభుత్వం ఆదివారం అనుమతిచ్చింది. అయితే తగినంత మంది వర్కర్లు లేకపోవడంతో చాలా సెలూన్లు తెరవలేదు. ముంబైలో మంచి ఫలితాలిచ్చిన 'చేజ్ ది వైరస్' పద్దతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఈ పద్దతిలో భాగంగా రోగితో కాంటాక్ట్‌ అయిన 15 మంది సన్నిహితులను హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. ఈ కార్యక్రమం మే 27 న ప్రారంభమయ్యింది. 

తమిళనాడు, కర్ణాటక, ఏపీ
తమిళనాడులో రికార్డు స్థాయిలో ఒకే రోజు   3,940 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 82,275 కు చేరుకుంది. గుజరాత్‌లో 624 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 31,397 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 813 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 13,098 చేరింది. పశ్చిమ బెంగాల్‌లో 572 తాజా కేసులు నమోదయ్యి  మొత్తం కేసుల సంఖ్య 17,283కు చేరుకుంది.

కర్ణాటకలో నిన్న 1,200 కొత్త కరోనా కేసులు నమోదయ్యి మొత్తం సంఖ్య 13,190కు చేరింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు ఫేస్ మాస్క్, సామాజిక దూరం వంటి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ఢిల్లీలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య పెంపు
దేశ రాజధాని ఢిల్లీలో కేసులు భారీగా పెరగటంతో అధికారులు కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను  218 నుంచి 417 కి పెంచారు. కరోనా వ్యాప్తిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వేలో భాగంగా కేవలం ఒక నెల రోజుల్లోనే సుమారు 2.45 లక్షల మంది ప్రజలను పరీక్షించారు. కరోనా కట్టడి కోసం ఇంటింటి సర్వే జూలై 6 వరకు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికే 2 లక్షల మందిని పరీక్షించామని అధికారులు తెలిపారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో 45,000 మందిని పరీక్షించామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ రాజధానిలో 34.35 లక్షలకు పైగా ఇళ్లు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 33.56 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 79,574 ఉన్నాయి. ఢిల్లీలో నిన్న ఒక్క రోజే 2,889 కొత్త కేసులు నమోదయ్యి మొత్తం కేసుల సంఖ్య 83,000 మార్కును దాటింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,623 కు పెరిగింది.

యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇంటింటి సర్వే
ఉత్తరప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి (వైద్య, ఆరోగ్య) అమిత్ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ జూలైలో మీరట్ డివిజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి నివారణ ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. పల్స్ పోలియో మాదిరిగానే ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్‌, నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో కూడా సర్వే నిర్వహిస్తామన్నారు. 13,186 కేసులు నమోదైన మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 1 నుంచి 'కిల్ కరోనా' ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని..ఇతర వ్యాధులపై కూడా పౌరులకు పరీక్షలు జరుపుతామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 15 రోజుల ఈ కార్యక్రమంలో 2.5 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని.. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది నమూనాలను సేకరిస్తామని చౌహాన్ తెలిపారు. 

అస్సాంలో లాక్‌డౌన్‌
అస్సాంలో ఇప్పటివరకు 7,165 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో మరోసారి పూర్తి లాక్‌డౌన్ విధించింది. గువాహటి దీని కిందకే వస్తుంది. ఇక్కడ ఆదివారం రాత్రి 7 నుంచి జూలై 12 సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కిరాణా, మాంసం, అన్ని ఇతర దుకాణాలు మూత పడతాయి. ఫార్మసీలు మాత్రమే పనిచేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 

భారతదేశంలో కరోనా పరీక్షల కోసం ప్రస్తుతం 1,036 డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగంలో 749, ప్రైవేటులో 287 ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రోజు 2,00,000 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షిస్తున్నారు. గత 24 గంటల్లో 2,31,095 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 82,27,802 అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ 28 నాటికి దేశవ్యాప్తంగా 1,055 కరోనా ఆస్పత్రుల్లో 1,77,529 ఐసోలేషన్ పడకలు, 23,168 ఐసీయూ పడకలు, 78,060 ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్‌ ఉన్నాయని అధికారులు తెలిపారు

Poll
Loading...
మరిన్ని వార్తలు