టైమ్స్‌ టాప్‌ 100లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’

28 Aug, 2019 16:37 IST|Sakshi

సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్‌ ఏటా రూపొందించే ‘వరల్డ్‌ టాప్‌ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ కాగా మరొకటి ముంబైలోని ‘సోహో హౌస్’‌. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల క్రితం ఒకే రోజు 34000 మంది టూరిస్టులు ఈ విగ్రహాన్ని సందర్శించడం విశేషం. ఈ రెండు అంశాలను పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సోహో హౌస్‌ ఐరోపా, అమెరికా ఖండాల బయట, ఆసియాలోనే మొదటిది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అరేబియా సముద్ర తీరంలో పదకొండు అంతస్థులతో నిర్మితమైంది. ఇందులో లైబ్రరీ, ఓపెన్‌ రూఫ్‌ టాప్‌ బార్‌తో పాటు 34 మందికి సరిపోయే సినిమా థియేటర్‌ కూడా ఉంది. దీని నిర్మాణంలో వాడిన ఫర్నిచర్‌, నిర్మాణ శైలి, భవనంలోని కళాకృతులతో ఈ భవనం ప్రత్యేకత కలిగి ఉంది. వాస్తవికత, ఆవిష్కరణ, కొత్తదనం, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజీన్‌ ఏటా ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రదేశాలను ఎంపిక చేస్తుంది.  

మరిన్ని వార్తలు