పట్టువదలని విక్రమార్కుడు

29 Nov, 2019 07:58 IST|Sakshi

ఏ మాత్రం తగ్గని     పొన్‌ మాణిక్య వేల్‌ 

ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు విగ్రహాలు 

సింగపూర్‌ నుంచి కూడా.. 

జనవరిలో ప్రధాని మోదీ చెంతకు

సాక్షి, చెన్నై: పట్టువదలని విక్రమార్కుడిలా విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ప్రత్యేక అధికారి పొన్‌ మాణిక్య వేల్‌ ముందుకు సాగుతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల్లో ఏ మాత్రం తగ్గబోనని మరో మారు చాటుకున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న రెండు విగ్రహాలను భారత్‌కు తెప్పించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో చాకచక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆ విగ్రహాలను ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ‘పొన్‌ మాణిక్య వేల్‌’ఈ పేరు వింటే చాలువిగ్రహాల స్మగ్లర్ల గుండెల్లో దడ బయలు దేరుతుంది. విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఐజీగా ఆయన స్మగ్లర్లకు ముచ్చమటలు పట్టించారు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను ఇక్కడికి రప్పించే దిశగా ముందుకు సాగారు.

అందుకే పదవీ కాలం ముగిసినా, ఆయన్నే ప్రత్యేక అధికారిగా కోర్టు నియమించింది. ప్రత్యేక అధికారిగా ఆయన నియమితులైనా పాలకుల నుంచి సాయం మాత్రం కరువైంది. అయితే, తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా, పాలకుల నుంచి సహకారం లేకపోవడంతో ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి రూ.నాలుగు కోట్లు విలువగల రెండు విగ్రహాలను భారత్‌కు రప్పించడం విశేషం.
 
ఆ్రస్టేలియా నుంచి.. 
తిరునల్వేలి జిల్లా వీరనల్లూరు సమీపంలో తిరువడై మరుదూర్‌ గ్రామం ఉంది. ఇక్కడ పాండ్య రాజుల హయంలో (600 ఏళ్ల క్రితం) మూంగీశ్వర ముడయార్‌ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని రెండు ద్వార పాలకుల విగ్రహాలు 1995లో అపహరణకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో పోలీసులు చేతులెత్తేయగా, పొన్‌ మాణిక్య వేల్‌ రహస్యంగా విచారణ చేపట్టి, ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించారు. స్మగ్లర్లు లక్ష్మి నరసింహన్, అశోకన్‌లు తన అనుచరుల ద్వారా ఇండో నేపాల్‌ ఆర్ట్‌ గ్యాలరీకి తరలించినట్టు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాలోని ఓ ప్రముఖ గ్యాలరీలో ఉంచినట్టు గుర్తించారు.

ఈ విగ్రహాల విలువ రూ.4 కోట్ల 98 లక్షలు. ఈ విగ్రహాలు తమిళనాట చోరీ చేసి, ఆ్రస్టేలియాకు తరలించినట్లు ఆ గ్యాలరీకి హెచ్చరికలతో కూడిన లేఖను ఇటీవల పొన్‌ మాణిక్య వేల్‌ పంపించారు. ఆ గ్యాలరీ వర్గాలు స్పందించి, భారత్‌కు తీసుకెళ్లాలని సూచించినా, వాటిని ఇక్కడికి తీసుకు రావడంలో పాలకుల సహాకారం అన్నది పొన్‌ మాణిక్య వేల్‌కు కరువైంది. దీంతో వ్యూహాత్మకంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మాణిక్య వేల్‌ వ్యవహరించారు.
 
విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో... 
తమిళనాడులో దోపిడికి గురైన విగ్రహాలు ఆ్రస్టేలియాలోని కొన్ని గ్యాలరీల్లో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేమని పేర్కొంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రెండు ద్వార పాలకులతో పాటుగా అక్కడున్న అన్ని విగ్రహాల విలువ, వాటి గురించిన పూర్తి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. ఇందులో రెండు విగ్రహాలను అప్పగించేందుకు సంబంధిత గ్యాలరీ ముందుకు వచ్చినా, ఇక్కడకు తీసుకు రాలేని పరిస్థితి ఉందని, సాయం అందించాలని కోరారు. దీంతో ఆ్రస్టేలియాలోని భారత రాయబార కార్యాలయ వర్గాల ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపులు జరిపాయి.

దీంతో ఆ విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రధాని ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదికి అప్పగించేందుకు నిర్ణయించారు. జనవరిలో ఆ్రస్టేలియా నుంచి ఈ విగ్రహాలు ఢిల్లీకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించనున్నారు. అనంతరం ఈ విగ్రహాలను పొన్‌మాణిక్య వేల్‌ బృందం తిరునల్వేలిలోని ఆలయానికి చేర్చనున్నారు. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. ఇక, ఆ్రస్టేలియాలో ఉన్న మిగిలిన విగ్రహాలు, సింగపూర్‌లో ఉన్న 16 విగ్రహాలను మరి కొన్ని నెలల్లో ఇక్కడికి తెప్పిస్తానని పొన్‌ మాణిక్య వేల్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు