క్షమ లేదిక.. ఏదో ఒకటి చేసేస్తాం

16 Jan, 2016 14:27 IST|Sakshi
క్షమ లేదిక.. ఏదో ఒకటి చేసేస్తాం

జైపూర్: 'మనది క్షమాగుణం కలిగిన దేశం. చాలామందిని చాలా విషయాల్లో క్షమిస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది. క్షమ లేదిక. ఏదో ఒక విధంగా తప్పుచేసినవాళ్ల భరతం పడతాం' అంటూ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీచేశారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్.

శనివారం జైపూర్ లోని సీఐఎస్ఎఫ్ మైదానంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని ప్రారంభించిన ఆయన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయ యువకులు గొప్ప దేశభక్తులని, జాతీయవాద భావాలు నిండినవారని అందుకే సైన్యంలో చేరేందుకు ఉత్సాహం చూపుతారని కితాబిచ్చారు.
 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగ ఉద్యోగులు ఉగ్రవాద సంస్థల ఉచ్చులో పడిపోకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి ఎయిర్ ఫోర్స్ లోని కొందరు ఉద్యోగులే సహకరించారనే ఆరోపణలు వెలుగుచేసిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ 'హనీట్రాప్ కేసులు వెలుగులోకి రావటం వాస్తవమే అయినప్పటికీ ఉన్నతస్థాయి అధికారులెవ్వరూ ఆ ఉచ్చులో పడలేదు. ఒకరిద్దరు కిందిస్థాయి ఉద్యోగులే కుట్రకు పాల్పడ్డారు. నిజానికి వ్యవస్థ అత్యంత బలంగా ఉన్నప్పుడే శత్రువులు హనీట్రాప్ తరహా పాచికలువేస్తారు. ఏదిఏమైనప్పటికీ ఉద్యోగులు ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని పారికర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు