రాందేవ్‌ శిష్యురాలికి ఫత్వా

8 Nov, 2017 11:01 IST|Sakshi

రాంచీ : యోగా శిక్షణ తక్షణం ఆపాలంటూ రఫియా నాజ్‌కు ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేశాయి. ఒక ముస్లింగా జన్మించి.. యోగా శిక్షణ ఎలా ఇస్తావంటూ మత సంస్థలు ఆమెను ప్రశ్నించాయి. యోగా ట్రయినింగ్‌ ఇవ్వడం తక్షణం ఆపాలని.. లేదంటే ప్రాణాలకు హాని తప్పదని సదరు సంస్థలు రఫియా నాజ్‌ను హెచ్చరించాయి.

ముస్లింల సంస్థల హెచ్చరికల నేపథ్యంలో రఫియాకు కట్టుదిట్టమైన భద్రతను జార్ఖండ్‌ ప్రభుత్వం కల్పించింది. మత సంస్థల హెచ్చరికలపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ ప్రధానకార్యదర్శి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. రఫియాకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు.

రఫియా నాజ్‌కు ఆమె కుటుంబ సభ్యులకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాంచీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కుల్దీప్‌ ద్వివేదీ తెలిపారు. రఫియా నాజ్‌ పలు సందర్భాల్లో యోగా గురు రామ్‌దేవ్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె యోగా మెళుకువలు నేర్పేవారు.

మరిన్ని వార్తలు