తిరిగిచ్చేస్తాను...ఒప్పదం రద్దు చేయండి

13 Mar, 2018 10:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ స్టెఫానీ క్లిఫర్డ్‌ మధ్య గత కొద్ది కాలం నుంచి కొనసాగుతన్న వివాదం అందరికి తెలిసిందే. తాజాగా ఈ వివాదం సరికొత్త​ మలుపు తిరగనుంది. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టకుండా ఉండేదుంకు ట్రంప్‌ తనకిచ్చిన 1,30,000 అమెరికన్‌ డాలర్ల సొమ్మును తిరిగి ఇచ్చివేయాలనుకుంటున్నట్లు క్లిఫోర్డ్‌ మీడియాకు తెలిపారు. ఫలితంగా తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన వ్యక్తిగత సలహాదారు మైకెల్‌ కోహెన్‌, వైట్‌ హౌస్‌ వర్గాలు ఖండించాయి.

అయితే అనూహ్యంగా కోహెన్‌ గత నెలలో ట్రంప్‌, స్టెఫానీ క్లిఫో​ర్డ్‌ మధ్య ఉన్న అనుబంధాన్ని బహిర్గతపరచకుండా ఉండాలని అందుకు ప్రతిఫలంగా సొమ్ము చెల్లించెలా 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆమెతో ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు. ప్రస్తుతం క్లిఫోర్డ్‌ తరుపు న్యాయవాది మైకెల్‌ అవనట్టి కోహెన్‌కు ఒక లేఖ పంపించాడు. అందులో తాము గతంలో చేసుకున్న ఒప్పందం వల్ల పొందిన 1,30,000 డాలర్లను తిరిగి ఇచ్చివేస్తామని, ఆ మొత్తాన్ని అధ్యక్షుని పేరిట ఉన్న ఖాతాలో జమచేస్తామని వివరించారు. ఫలితంగా వారి మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దుచేయాలని కోరారు.

ఒకవేళ ఒప్పందం రద్దయితే క్లిఫోర్డ్‌ తనకు అధ్యక్షునికి మధ్య ఉన్న అనుబంధం గురించి బహిరంగంగా మాట్లాడవచ్చు, తమ అనుబంధానికి సంబంధించిన సందేశాలను, ఫోటోలను, వీడియోలను బహిర్గతం చేయవచ్చు. దానివల్ల ఆమె మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలులేదు.


 

మరిన్ని వార్తలు