ఇఫ్తార్‌పై గిరిరాజ్‌ వివాదాస్పద ట్వీట్‌

5 Jun, 2019 05:05 IST|Sakshi

మందలించిన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా  

న్యూఢిల్లీ: బిహార్‌లో ఇఫ్తార్‌ విందులకు ఎన్డీయే నేతలు హాజరవుతుండటంపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌ ఒకటి వివాదాస్పదమైంది. గిరిరాజ్‌ ట్వీట్‌పై జేడీయూ నేతలు విమర్శలు వ్యక్తం చేయడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రంగంలోకి దిగి గిరిరాజ్‌ను మందలించారు. బిహార్‌లో సీఎం నితీశ్‌ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ సహా మొత్తం నలుగురు ఎన్డీయే నేతలు ఇఫ్తార్‌ విందులకు హాజరైన ఫొటోలను గిరిరాజ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని రాశారు.

ఓ ఫొటోలో బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్‌ మోదీ కూడా ఉండటం గమనార్హం. లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడు పాశ్వాన్‌తోపాటు బిహార్‌ ప్రతిపక్ష నేత జితన్‌ రామ్‌ మాంఝీ పట్నాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులకు సంబంధించినవే ఈ ఫొటోలు. గిరిరాజ్‌ ట్వీట్‌పై జేడీయూ, ఎల్జేపీ నేతలు అసంతృప్తి, విమర్శలు వ్యక్తం చేయడంతో అమిత్‌ షా రంగంలోకి దిగారు. గిరిరాజ్‌ను మందలిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను మళ్లీ భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హిందూత్వ భావజాలం బాగా కలిగిన గిరిరాజ్‌ గతంలోనూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే.

నేడే ఈద్‌–ఉల్‌–ఫితర్‌
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: మంగళవారం నెలవంక దర్శనంతో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్‌ నెల ఉపవాసాలు విరమించి బుధవారం ఈద్‌–ఉల్‌–ఫితర్‌ పండుగ ఆచరించనున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన నెలవంక దర్శన కమిటీ సమావేశానంతరం జామా మసీదు షాహి ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘మంగళవారం చంద్రుడు కన్పించాడు. అందువల్ల బుధవారం ఈద్‌ (పండుగ) జరుపుకోవాలి’ అని మసీదు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 5వ తేదీ బుధవారం ముస్లింలు రంజాన్‌ పండుగను జరుపుకోవాలని హైదరాబాద్‌లోని రుహియతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు