లేటు.. అనే మాటే లేదు!

6 Aug, 2018 01:55 IST|Sakshi

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఎక్కడైనా ఉచిత వైద్యం

మరణాల సంఖ్య తగ్గించేందుకు కేంద్రం కొత్త బిల్లు

ముసాయిదాలో ‘గోల్డెన్‌ అవర్‌’కు ప్రాధాన్యం

గోల్డెన్‌ అవర్‌ను ఆనాడే గుర్తించిన వైఎస్‌..108 ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : గోల్డెన్‌ అవర్‌.. 60 నిమిషాలు.. రోడ్డుపై తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న క్షతగాత్రులకు అమూల్యమైన సమయం. ఆ వ్యక్తిని గంటలోపు ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తే బతికే అవకాశాలు చాలా ఎక్కువ. మెదడు భద్రంగా ఉండి.. శరీరంలో ఇతర అవయవాలకు తీవ్ర గాయాలైనా 60 నిమిషాల్లో చికిత్స చేస్తే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఇలా ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స కోసం ‘మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు–2016’ను కేంద్రం రూపొందించింది. బిల్లు చట్టమై అమల్లోకి వస్తే ప్రాణ నష్టం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఏటా 1.5 లక్షల మంది మృతి
దేశంలో ఉగ్రవాదం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2015లో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. చాలా ప్రమాదాల్లో వైద్యం ఆలస్యం కావడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికం యువతే కావడం ఆందోళనకరం. దేశానికి ఎంతో విలువైన మానవ వనరులు రోడ్డు ప్రమాదాల వల్ల అసువులు బాయడం దురదృష్టం.  

పెరుగుతున్న వాహనాలు
దేశంలో ఏటేటా వాహనాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బైకులు, కార్లు, ఇతర వాహనాలు కలిపి ఇప్పటికే కోటి దాటాయి. మెరుగైన రహదారులు, ఆధునిక వాహనాలు పెరుగుతున్న దరిమిలా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త చట్టం అమలుతో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గనుంది.

2004లోనే గుర్తించిన వైఎస్‌
2004లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రవేశపెట్టిన 108 పథకం విజయవంతమైంది. రాష్ట్రం, పార్టీలకు అతీతంగా దేశమంతటా దీన్ని అమలు చేయడం ప్రారంభించారు. వైఎస్‌ స్వతహాగా వైద్యుడు కావడంతో ‘గోల్డెన్‌ అవర్‌’ప్రాధాన్యం ఆనాడే గుర్తించగలిగారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. 108 అంబులెన్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  

కొత్త చట్టం ఏం చెబుతోంది?
‘మోటారు వాహన చట్టం సవరణ బిల్లు– 2016’49వ క్లాజులో ‘గోల్డెన్‌ అవర్‌’ను ప్రస్తావించారు. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఏ ఆస్పత్రిలోనైనా ఉచితంగా చికిత్స అందించాలి. రోడ్డు ప్రమాదాల్లో మరణిం చిన వారికి ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం రూ.25 వేల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తోంది. కొత్త చట్టంతో పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచనున్నారు. ‘గోల్డెన్‌ అవర్‌’పదం వినియోగం మనదేశంలో తక్కువేగానీ.. అమెరికా, యూరోప్‌ లాంటి పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు దీనికి ప్రాధాన్యం ఇస్తాయి. అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి తరలించేందుకు ఎయిర్‌ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. మన వద్ద 108 సర్వీసులొచ్చాక రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గింది. 

మరణాలు తగ్గుతాయి
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి విషయంలో గోల్డెన్‌ అవర్‌ ఎంతో కీలకం. మొదటి 60 నిమిషాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకొస్తే రక్తస్రావం ఆపొచ్చు. బీపీని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు. గాయాల వల్ల శరీరంలోకి ఇన్ఫెక్షన్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీని ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించడం హర్షణీయం.
 -డాక్టర్‌ శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్‌ (ఆర్థో), హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రి  

మరిన్ని వార్తలు