అంపశయ్యపై ఆదివాసీ బిడ్డ

2 Aug, 2018 12:56 IST|Sakshi
వింతరోగంతో బాధపడుతున్న మీతశొబొరొ  

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

ఒరిస్సా : ఈ  దీనురాలి ఆవేదన ఏ దూర తీరాలకు చేరగలదు. ఏ భగవంతునికి  ఈ దీనురాలు తన మొరను నివేదించుకోగలదు. ఈ దీనురాలి కష్టం ఏ అధికారి హృదయాన్ని కదిలించగలదు. వింతరోగంతో బాధ పడుతున్న ఈ దీనురాలిని చూస్తున్న పలువురి హృదయాలు ద్రవిస్తున్నాయి తప్ప ఆమెకు న్యాయం జరిగే మార్గం కానరావడం లేదు.నిరుపేద కుటుంబంలో జన్మించడమే పాపమైతే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తోబుట్టువు సాయంతో జీవనం సాగిస్తున్న  ఆదివాసీ బాలికకు తెలియని వింతరోగం సోకింది.

దీంతో చేతులు చచ్చుబడిపోయి పొంగిపోయి ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉంది. తన అక్క గ్రామంలోని ఇళ్లలో పాచిపనిచేస్తూ జీవనం సాగిస్తుండగా పరిస్థితి విషమించడంతో పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. రాయగడ జిల్లా పద్మపూర్‌ సమితి పేరుపంగ గ్రామానికి చెందిన మీతశొబొరొ అనే బాలిక జన్మించిన తర్వాత తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆమె అక్క పాచిపని చేస్తూ సోదరిని పోషించుకుంటూ వస్తోంది.

అయితే ఇటీవల విధి వక్రించి  మీతశొబొరొకు చేతికి సంబంధించిన ప్రమాదకరమైన జబ్బు సోకింది. దీనికి కటక్‌ పెద్దాస్పత్రిలో ఆపరేషన్‌ చేయిస్తే నయం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో పలువురు రాజకీయ నాయకులు, జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది.  కలెక్టర్‌ దయదలిచి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాలికకు కావలసిన ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు