-

అడ్డగోలు విరాళాలకు ‘చెక్‌’

2 Feb, 2017 02:10 IST|Sakshi
అడ్డగోలు విరాళాలకు ‘చెక్‌’

రాజకీయ పార్టీల విరాళాలపై కఠిన ఆంక్షలు

  • రూ.2 వేలు దాటితే చెక్కు లేదా డిజిటల్‌ రూపంలో ఇవ్వాల్సిందే
  • రిటర్న్స్‌ పత్రాల దాఖలు తప్పనిసరి
  • తెరపైకి కొత్తగా ఎలక్టోరల్‌ బాండ్లు
  • దాతలు బ్యాంకుల ద్వారా వాటిని కొనుగోలు చేసి.. పార్టీలకు ఇవ్వొచ్చు
  • పార్టీకి, దాతకు ఐటీ నుంచి మినహాయింపు.. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే: జైట్లీ

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇకపై ఇష్టారాజ్యంగా విరాళాలు తీసుకోవడం కుదరదు! రూ.2 వేలు దాటిన ప్రతి విరాళం ఇక ‘లెక్క’లోకి రానుంది. అంతకుమించితే కచ్చితంగా చెక్కు, డిజిటల్‌ రూపంలో లేదా ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఇవ్వా ల్సి ఉంటుంది. అలాగే ప్రతి పార్టీ ట్యాక్స్‌ రిటర్న్స్‌ పత్రాలు దాఖలు చేయడం తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో ప్రకటించారు. పార్టీ విరాళాల్లో పారదర్శకత, నల్లధనం నిరోధానికి ఆయన ఈ చర్యలను ప్రతిపాదించారు. కొత్తగా ‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’ను తెరపైకి తెచ్చారు.

బ్యాంకుల ద్వారా బాండ్లు
‘‘ప్రస్తుతం ఒక వ్యక్తి రూ.20 వేల వరకు పార్టీకి విరాళంగా ఇవ్వొచ్చు. అయితే దీన్ని రూ.2 వేలకే పరిమితం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.  రూ.2 వేలకు మించితే దాతలు ఇకపై కచ్చితంగా చెక్కు లేదా డిజిటల్‌ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది’’ అని జైట్లీ వివరించారు. ఎలక్టోరల్‌ బాండ్లను జారీ చేసేందుకు కొత్త పథకం తెస్తామని, ఇందుకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టానికి సవరణలు చేస్తామని తెలిపారు. ‘‘పార్టీలకు విరాళం ఇవ్వాలనుకునే దాతలు చెక్కు లేదా డిజిటల్‌ రూపంలో బ్యాంకుకు సొమ్మును చెల్లించి ఈ ఎలక్టోరల్‌ బాండ్లను కొనుక్కోవాలి. ఈ సమయంలో వారిచ్చే సొమ్ము వైట్‌మనీ, క్లీన్‌మనీ అవుతుంది.

ర్వాత వారు ఆ బాండ్లను రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చుకోవచ్చు. నిర్దిష్ట సమయంలోగా పార్టీలు వాటిని బ్యాంకులకు సమర్పించి తమ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేసుకోవచ్చు’’ అని జైట్లీ వివరించారు. ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చామనే వివరాలు బయటకి పొక్కితే లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తమ వివరాలు గోప్యంగా ఉంచుకోవాలనుకునే వారికి ఈ బాండ్లు ఒక ఉపకరణంగా ఉపయోగపడతాయి. తమ వివరాలు బయటకు తెలిసినా నష్టం లేదనుకునేవారు నేరుగా చెక్కు, డిజిటల్‌ పేమెంట్ల రూపంలో పార్టీలకు విరాళాలు చెల్లించవచ్చు. ‘‘ఎలక్టోరల్‌ బాండ్లపై దాత పేరు ఉండదు. విరాళం పొందిన పార్టీతోపాటు దాతకూ మినహాయింపు వర్తిస్తుంది. టాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేసే సమయంలో ఈ మినహాయింపును పొందవచ్చు. పార్టీలు తమకు బాండ్లు ఎవరిచ్చారు? ఎన్ని బాండ్లు వచ్చాయన్న వివరాలను ఆ పత్రాల్లో పొందుపరచాలి. అప్పుడే పన్ను మినహాయింపు వర్తిస్తుంది’’ అని జైట్లీ స్పష్టంచేశారు.

కొత్త విధానంతో ‘క్లీన్‌’ మనీ
ఈ కొత్త విధానంతో రాజకీయ పార్టీల విరాళాల్లో పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని, బ్లాక్‌మనీ నిరోధానికి కూడా తోడ్పడుతుందని జైట్లీ చెప్పారు. ఇప్పటిదాకా పార్టీలకు నగదు రూపంలోనే విరాళాలు అందుతున్నాయని, అందులో పారదర్శకత లోపించిందని చెప్పారు. తాజా విధానంలో దాతలు ఇచ్చే సొమ్ము, పార్టీలకు అందే సొమ్ము క్లీన్‌గా ఉంటుందన్నారు. లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరుగుతాయి కాబట్టి అవన్నీ పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు