ధిక్కరించిన ధీరవనితలు!

10 Jun, 2019 07:03 IST|Sakshi

దుష్ప్రచారం.. భౌతిక దాడులపై తిరుగుబావుటా

ఎదురొడ్డి నిలిచి.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మహిళలు

పార్లమెంట్‌కు ఎన్నికవడమంటే మాటలా.. అంగబలం, అర్థబలం కనీస అర్హత. లేదంటే పెద్దనాయకుల ఆశీర్వాదం, అండ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎన్నికల రణంలోకి అడుగుపెట్టిన ఈ సామాన్య మహిళలకు అడుగడుగునా వేధింపులు, దాడులు, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే తమను అవేవీ అడ్డుకోలేవని రుజువు చేస్తూ ఆకాశమంత విజయాల్ని అందుకున్న నారీమణులకు భారత చట్టసభ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీరి విజయం సాధించిన వైనం గొప్పది. చారిత్రకమైంది.

బ్యాంకు ఉద్యోగి కావాలనుకుని..
చంద్రాణి ముర్ము (ఒడిశా, బీజేడీ)
ఈనెల 16వ తేదీన 26వ బర్త్‌డే జరుపుకోనున్న ఒడిశాకు చెందిన చంద్రాణి ముర్ము 17వ లోక్‌సభలో పిన్నవయస్కురాలైన సభ్యురాలు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతోన్న చంద్రాణికి అనూహ్యంగా కియోంజా లోక్‌సభ టికెట్‌ వచ్చింది. విజయం అంత తేలికగా వరించలేదామెను. సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు ఆమెను మానసిక వేదనకు గురి చేశాయి. ‘నేనొక సాధారణ మహిళను. నన్ను నిజంగా జనం ఆమోదిస్తారా అని చాలా సంకోచించాను. కానీ, ప్రజలకు నచ్చిన గుణమేదో నన్ను మున్ముందుకు సాగేలా చేసింది’అంటూ ఎన్నికల్లోకి అడుగుపెట్టిన క్షణాలను గుర్తుచేసుకున్నారు చంద్రాణి. ఈమె తాత హరిహర్‌ సోరెన్‌ గతంలో కాంగ్రెస్‌ ఎంపీ.

మార్క్సిస్టుల కోటలో పాగా వేశారు
రమ్యా హరిదాస్‌ (కేరళ, కాంగ్రెస్‌)
విద్య, ఆరోగ్యంలాంటి ఎన్నో రంగాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటోన్న కేరళ నుంచి 17వ లోక్‌సభకు ఎన్నికైన ఏకైక సభ్యురాలు రమ్యా హరిదాస్‌(32). సంగీతంలో డిగ్రీ చేసిన రమ్య సామాజిక స్పృహ,జానపద గానంతో ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ఐదు దశాబ్దాల తరువాత మార్క్సిస్టుల కంచుకోటలో పాగా వేశారు. రెండుసార్లు ఎంపీ అయిన పీకే బిజూని 1.58 లక్షల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఈమె తల్లిదండ్రులు నిరుపేదలు. ఈమెలోని ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ మిగతా వారిని కాదని టికెట్‌ ఇచ్చారు. దీంతో స్థానిక నేతల నుంచి సహాయనిరాకరణ ఎదురైంది. కమ్యూనిస్టులు బురదచల్లే యత్నం చేశారు. రాళ్లతో దాడి చేయించారు. అయినా, తట్టుకుని నిలబడి గెలుపు సాధించారు.

జానపద గీతంతో జనం మనసు గెలిచారు
ప్రమీలా బిసోయీ (ఒడిశా, బీజేడీ)
2019 లోక్‌సభ ఎన్నికల్లో పరిమళించిన మరో మహిళా కుసుమం ప్రమీలా బిసోయీ! ఐసీడీఎస్‌ హెల్పర్‌గా ఉన్న ప్రమీలకు ఎంపీ టికెట్‌ ఇస్తామంటూ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆహ్వానించినా చార్జీలకు డబ్బుల్లేక తిరస్కరించారు. ఇది తెలిసిన సీఎం స్వయంగా కారు పంపి ప్రమీలను భువనేశ్వర్‌కు రప్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రమీల ‘రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు’అన్నారు. భారీ ఉపన్యాసాలకు బదులు తనకు తెలిసిన విద్య జానపదగీతాలను ఆలపించి ప్రజల మనసులను గెలిచారు. నిరుపేదల వలసలను నివారించేందుకు తమ ప్రాంతంలో చిన్న పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానంటున్నారీమె.

నా విజయం అందరికీ స్ఫూర్తి
నుస్రత్‌ జహా (పశ్చిమబెంగాల్, టీఎంసీ)
పశ్చిమబెంగాల్‌ ఉత్తర పరగణా జిల్లాలోని బాసిర్‌ హాట్‌ నుంచి టీఎంసీ తరఫున పోటీకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు నటి నుస్రత్‌ జహా.  పేద పిల్లల షెల్టర్‌ హోంల కోసం ఎన్జీవోతో కలిసి పనిచేశారు. ‘నేను సొంత ఇల్లు కొనుక్కోవడానికి ముందు పిల్లల కోసం షెల్టర్‌ హోం కట్టిస్తా’అని ప్రకటించారు నుస్రత్‌. పాశ్చాత్య దుస్తుల్లో పార్లమెంట్‌ ఎదుట ఆమె నిలబడి ఉన్నట్లుగా మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను రాజకీయ విరోధులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినా ఆమె జంకలేదు. ‘నేను ఎవరిని అనేది ధరించిన దుస్తులను బట్టి తెలియదు. నాపైన వచ్చిన తప్పుడు ప్రచారాలను పక్కన పెట్టి నేను విజయం సాధించాను. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచాను’అంటున్నారు నుస్రత్‌.  

హరియాణా నుంచి ఏకైక మహిళ
సునితా దుగ్గల్‌ (హరియాణా, బీజేపీ)
పురుషాధిపత్యానికి మారుపేరుగా నిలిచే ఖాప్‌ పంచాయితీ పునాదులున్న హరియాణా నుంచి ఒక మహిళ చట్టసభలకు ఎన్నికవడం నిజంగా విశేషమే. హరియాణా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఏకైక మహిళ సునితా దుగ్గల్‌. ఎంపీగా ఎన్నికవడానికి ఆమె ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి రావడం వల్ల సునితా దుగ్గల్‌ వాటిని ఎదుర్కోగలిగారు. మాజీ రెవెన్యూ అధికారి అయిన సునితా 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దేశంలోనే స్త్రీ, పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంతో హరియాణాలో లింగ నిష్పత్తి చాలా వరకు మెరుగైందని తెలిపారు దుగ్గల్‌.

మరిన్ని వార్తలు