మద్రాస్ ఐఐటీలో ‘గుర్తింపు’ రగడ!

30 May, 2015 06:08 IST|Sakshi
మద్రాస్ ఐఐటీలో ‘గుర్తింపు’ రగడ!

మోదీని విమర్శించారన్న ఫిర్యాదుతో విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు
చెన్నై/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారన్న ఫిర్యాదు ఆధారంగా మద్రాస్ ఐఐటీ ఓ దళిత విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు  చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. వాక్‌స్వేచ్ఛ అణచివేతను ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఐఐటీ నిర్ణయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ సమర్థించడంతో శుక్రవారం ఢిల్లీలో ఆమె ఇంటి ముందు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన. చేశారు. ఐఐటీకి చెందిన అంబేడ్కర్-పెరియార్ స్టడీ సర్కిల్(ఏపీఎస్‌సీ) విద్యార్థి సంఘం ఇటీవల ఓ సమావేశం నిర్వహించింది.

అందులో ప్రధానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టారని, కేంద్ర విధానాలను తప్పుపట్టారంటూ మానవ వనరుల శాఖకు కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆ శాఖ ఐఐటీకి పంపింది. తర్వాత ఐఐటీ ఆ విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. ‘విద్యార్థి సంఘాలు ఏవైనా తమ కార్యక్రమాలకు ఐఐటీ మద్రాస్ పేరునుగానీ, ఆ విద్యాసంస్థ అధికార విభాగాల పేర్లనుగానీ అనుమతి లేకుండా ఉపయోగించరాదు. దీన్ని ఏపీఎస్‌సీ ఉల్లంఘించింది. దీంతో ఆ సంఘం గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది’ అని ఐఐటీ తాత్కాలిక డెరైక్టర్ ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు.
 
రాహుల్, స్మృతి మాటల యుద్ధం
ఐఐటీ గొడవపై రాహుల్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘వాక్‌స్వేచ్ఛ ప్రజల హక్కు. మోదీ విమర్శించినందుకు ఇప్పుడు విద్యార్థి సంఘంపై నిషేధం విధించారు. రేపు దేనిపై నిషేధం విధిస్తారు?’ అని రాహుల్ ట్విటర్‌లో ప్రశ్నించారు. స్మృతి బదులిస్తూ.. ‘తదుపరి పోరుపై మీతోనే. ఎన్‌ఎస్‌యూఐ మాటున దాక్కోకు. త్వరలో మళ్లీ అమేథీకి వస్తున్నా. అక్కడ కలుద్దాం. కేంద్ర ప్రభుత్వ పాలన చర్చకు సిద్ధం. సమయం, వేదిక ఎక్కడో మీరే చెప్పండి. గొడవ చేయాలని మీరు నిన్న ఎన్‌ఎస్‌యూఐకి చెప్పారు. ఈరోజు గూండాలు నేను లేనప్పుడు వచ్చి ఇంటి ముందు గొడవ చేశారు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు