పల్లె అల్లం... పట్నం బెల్లం!

12 Sep, 2014 22:55 IST|Sakshi
పల్లె అల్లం... పట్నం బెల్లం!

* ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివేందుకు విముఖత
* నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కళాశాల్లో చేరేందుకు ఆసక్తి
* ఎంబీయే చదువు కోసం ఢిల్లీ, ఎన్సీఆర్‌కే మొదటి ఓటు
* తర్వాతి స్థానాల్లో బెంగళూరు, పుణే, ముంబై నగరాలు

 
న్యూఢిల్లీ: ఉపాధి కోసమే కాదు.. చదువుకునేందుకు కూడా జనం ఇప్పుడు పట్నంబాట పడుతున్నారు. గ్రామీణ  ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నా పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో చేరేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు.
 
పట్టణాలు, నగరాల్లోని కళాశాలల్లో సరైన సదుపాయాలు, బోధించే ఉపాధ్యాయులు లేకపోయినా అందులోనే చేరుతున్నారు. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 66 మంది పట్టణాల్లో చదివేందుకే ప్రాధాన్యతనిస్తున్నారని శిక్షా డాట్ కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వే ద్వారా వెల్లడైన వివరాల్లోకెళ్తే...

రాజధాని రమ్మంటోంది...
సాంకేతిక విద్య బాటపట్టే విద్యార్థులు... ప్రత్యేకించి ఎంబీఏ చదవాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువమంది ఢిల్లీ, రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లోని కళాశాల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 21.1 శాతం మంది విద్యార్థులు ఎంబీఏ చదివేందుకు ఢిల్లీ, ఎన్సీఆర్‌కే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత 17.58 శాతం మంది బెంగళూరు కళాశాలలకు, 10.63 మంది పుణే కళాశాలలకు, 8.4 శాతం మంది ముంబైలోని కాలేజీలకు తమ ఓటు వేశారు.
 
అనేక కారణాలు...
రాజధాని ఢిల్లీలోని కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి అనేక కారణాలున్నాయని శిక్షా డాట్ కామ్ బిజినెస్ హెడ్ మనీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాల్లో సరైన వసతులు లేకపోవడం, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు అంతగా అందుబాటులోకి లేకపోవడం వంటివి విద్యార్థులను హస్తినవైపు చూసేలా చేస్తున్నాయన్నారు. రాజధానిలో అయితే ఉద్యోగం చేసుకుంటూ కూడా చదువుకునే అవకాశముందనే అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేశారన్నారు.
 
అంతేకాక తామ చదువుతున్న కోర్సుకు సంబంధించి కోచింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయని, అదే ఇతర ప్రాంతాల్లో కష్టమేనని చెబుతున్నారు. ఇంజ నీరింగ్ విద్యార్థులేకాదు ఆర్ట్స్, సైన్స్, కామర్స్, డిజైన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇదే అభిప్రాయంతో ఢిల్లీ, ఎన్సీఆర్‌లోని కళాశాలల్లో చేరామన్నారు.

>
మరిన్ని వార్తలు