కావేరిలో కర్ణాటక విద్యార్థుల గల్లంతు..

23 Dec, 2017 08:31 IST|Sakshi

ఒకరి మృతదేహం లభ్యం 

మరో ఇద్దరి కోసం గాలింపు

సాక్షి, సేలం: ధర్మపురి జిల్లాలో కావేరి నదిలో మునిగి కర్ణాటక విద్యార్థులు ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సంతోష్‌ కారులో స్నేహితులు సూర్య, బాలాజీ, అరుణ్‌ కుమార్, కార్తిక్, నందకుమార్, పిజిలీ రావు, ఎస్‌ఎస్‌ అని మొత్తం ఎనిమిది మంది శుక్రవారం ధర్మపురి జిల్లాలో ఉన్న హొగ్నెకల్‌కు పర్యటనకు వచ్చారు. 

ఇక్కడ ఉన్న జలపాతాల్లో స్నానాలు చేసి ఆనందించారు. తర్వాత కర్ణాటకకు వెనుదిరిగిన వారు అంజట్టి వద్ద వెళుతుండగా ఆలంబాడి అనే ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో స్నానం చేయడానికి దిగారు. అయితే అక్కడ స్నానం చేయకూడదు– ప్రమాదం అనే బోర్డు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ నీటిలో స్నానం చేయడానికి దిగారు. వారిలో సంతోష్‌ కొంత దూరం వెళ్లగా నీటి ఉధృతి అధికంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. 

అతన్ని కాపాడేందుకు బాలాజి, ఎస్‌ఎస్‌ ప్రయత్నించారు. అయితే వారు కూడా నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగిలిన వారు ఒడ్డుకు చేరి పెన్నగరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పెన్నగరం డీఎస్పీ అన్బురాజ్, అగ్నిమాపక సిబ్బంది చుట్టు పక్కల గాలించి బాలాజి మృతదేహాన్ని బయటకు తీశారు.  మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సరదాగా షికారుకు వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లిన స్నేహితుడిని చూసి సహ మిత్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 
 

మరిన్ని వార్తలు