బయటివారిని పెళ్లి చేసుకోమని విద్యార్థుల ప్రతిజ్ఞ

3 Sep, 2019 16:11 IST|Sakshi

ఐజ్వాల్‌ : ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో గిరిజన జనాభా అధికమనే విషయం తెలిసిందే. అయితే అక్కడి గిరినులు తమ ఉనికిపై బయటివారి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మిజో గిరిజన తెగకు చెందినవారు బయటి వ్యక్తులను(గిరిజనేతరులను) పెళ్లి చేసుకోవద్దనే ప్రచారాన్ని విస్తృతం చేశారు. మిజోరంలో అత్యంత ప్రాబల్యం ఉన్న విద్యార్థి సంఘం మిజో జిర్‌లాయి పాల్‌(ఎంజెడ్‌పీ) ఇందుకోసం నడుం బిగించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు పాఠశాలలోని విద్యార్థులతో సోమవారం ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు. బయటి వ్యక్తుల ప్రభావం నుంచి తమ గిరిజన సంస్కృతిని రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంజెడ్‌పీ సభ్యులు తెలిపారు.

ఎంజెడ్‌పీ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘2015 నుంచి ప్రతి సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మిజోరం వెలుపలి వ్యక్తులను పెళ్లి చేసుకోవద్దని విద్యార్థులను కోరుతున్నాం. మాది చాలా చిన్న సంఘం.. బయటివారితో మేము సులువుగా కలిసిపోలేం. ఒకవేళ ఇక్కడివారు బయటివారిని పెళ్లి చేసుకుంటే మా సంఖ్య మరింతగా తగ్గుంతుంది. ఎంజెడ్‌పీ నాయకులు సోమవారం రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో పర్యటించారు. బయటి వ్యక్తులను వివాహం చేసుకోవద్దని ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించాం. కానీ వారితో ఎటువంటి లిఖిత పూర్వక పత్రాలు రాయించుకోలేదు. మేము ఎవరిని బలవంతం చేయడం లేదు. కేవలం విద్యార్థులకు సూచన మాత్రమే చేస్తున్నామ’ని తెలిపారు. కాగా, మిజో మహిళలు గిరిజనేతరులను పెళ్లి చేసుకుంటే వారు తాము అనుభవిస్తున్న ఎస్టీ హోదాను కోల్పోయేలా చట్టం తీసుకురావాలని యంగ్‌ మిజో అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు