ఒడిశా బాలికల అరుదైన పోరాటం

28 Jan, 2016 16:41 IST|Sakshi

భువనేశ్వర్: భారత గణతంత్ర దినోత్సవం రోజు ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు అరుదైన పోరాటాన్ని ఎంచుకున్నారు. సమస్యలతో విసిగి వేసారిన వారు.. చివరికి  తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఆరునూరైనా కలెక్టరును కలిసి తమ  బాధలు చెప్పుకొని తీరాల్సిందేనని తీర్మానించుకున్నారు. దానికోసం పెద్ద సాహసమే చేశారు. 73 మంది బాలికలు దండుగా కదిలారు.  సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. అర్థరాత్రి చలిలో 7 గంటలు పాటు నడిచి వెళ్లి మరీ తమ  సమస్యను అధికారుల దృష్టికి  తీసుకెళ్లారు.

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బాలికల వసతిగృహంలో విద్యార్థులు దుర్భర స్థితిలో చదువుకుంటున్నారు. సౌకర్యాలు దేవుడెరుగు.. కనీసం కడుపునిండా భోజనం కూడా ఉండదు.  దీంతో  చదువు  కుంటుపడింది. హాస్టల్‌ అధికారులు తమను చిన్న చూపు చూస్తున్నారని, నాసిరకం భోజనం పెడుతున్నారని, పాఠశాలలో సరైన బోధన వనరులు లేవని ఎన్నోసార్లు అధికారులకు విజ్క్షప్తి చేశారు. అయినా ఫలితం శూన్యం.  

దీంతో పాపం.. ఆ చిన్నారులు తమ దుస్థితిని  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం రాత్రి కాలినడకన బయలుదేరారు.  వద్దని  ఎవరు ఎంత వారించినా వెనక్కి తగ్గలేదు.  పోలీసులు, ఇతర అధికారులు, పెద్దలు వారి ప్రయత్నాలను విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వాహనం ఏర్పాటుచేస్తామన్నా వినలేదు. పట్టిన పట్టు వీడకుండా ముందుకు  సాగారు. చేసేదేమీ లేక పోలీసులే వారికి రక్షణగా వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ధర్నా మొదలుపెట్టారు.  దీంతో కలెక్టర్ స్పందించక తప్పలేదు.

కలెక్టర్‌ రాజేశ్‌ ప్రవకర్‌ పాటిల్‌ వెంటనే ఆ ప్రాంతంలో పర్యటిస్తాననీ, .. వారి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తానని హామీ యిచ్చారు. దీంతో బాలికలు ఆందోళనను విరమించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలపై జిల్లా సంక్షేమ సంఘ కార్యాలయం అధికారులు అర్ధరాత్రి ఆ బాలికల్ని సురక్షితంగా వసతి గృహానికి తరలించారు. అయితే దీనిపై  జిల్లా సంక్షేమ అధికారుల వాదన మరోలా ఉంది. కొత్తగా విధుల్లో చేరిన అధికారికి వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు