హ్యాండ్‌వాష్‌ అందుబాటులో లేక..

21 May, 2020 14:46 IST|Sakshi

అల్పాదాయ దేశాలకు కోవిడ్‌-19 ముప్పు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో భారత్‌లో 5 కోట్ల మందికి పైగా అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలు సరైన రీతిలో చేతులు పరిశుభ్రపరుచుకునే సదుపాయానికి నోచుకోలేదని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. మెరుగైన హ్యాండ్‌వాషింగ్‌ సదుపాయం లేని వీరందరికీ కోవిడ్‌-19 ముప్పు పొంచిఉందని హెచ్చరించింది. శుభ్రమైన నీరు, సబ్బు అందుబాటులో లేని కారణంగా అల్పాదాయ, మధ్యశ్రేణి రాబడి కలిగిన దేశాల్లోని 200 కోట్ల మంది ప్రజలకు కోవిడ్‌-19 సంక్రమించే ముప్పు అధికమని వాషింగ్టన్‌కు చెందిన హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ (హెచ్‌ఎంఈ) సంస్థ పరిశోధకులు వెల్లడించారు. 46 దేశాల్లో సగానికి పైగా జనాభాకు సబ్బు, సురక్షిత నీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు.

ఇక భారత్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, కాంగో, ఇండోనేషియాల్లో ప్రతి దేశంలో 5 కోట్ల మందికి సరైన హ్యాండ్‌వాషింగ్‌ సదుపాయం అందుబాటులో లేదని అంచనా వేసింది. కోవిడ్‌-19 సంక్రమణను అడ్డుకునేందుకు కీలకమైన చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే  కనీస సదుపాయం వర్ధమాన దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలకు కొరవడిందని ఐహెచ్‌ఎంఈ ప్రొఫెసర్‌ మైఖేల్‌ బ్రౌర్‌ అన్నారు. హ్యాండ్‌ శానిటైజర్లు, మంచినీటి ట్యాంకర్ల సరఫరా అనేది తాత్కాలిక ఉపశమనమేనని, కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని చెప్పారు. చేతులను సరైన రీతిలో పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో ఏటా ఏడు లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. 1990 నుంచి 2019 మధ్య సౌదీ అరేబియా, మొరాకో, నేపాల్‌, టాంజానియా వంటి దేశాలు తమ ప్రజల్లో పారిశుద్ధ్యంపై మెరుగైన అవగాహన కల్పించడంలో విజయం సాధించాయని పరిశోధకులు పేర్కొన్నారు.

చదవండి : క‌రోనా వార్డు: బికినీలో న‌ర్సు సేవ‌లు

>
మరిన్ని వార్తలు