కడుపులో కాయిన్లు, బ్లేడ్లు, సూదులు

3 Dec, 2017 02:21 IST|Sakshi

ఫుడ్‌ పాయిజన్‌ అయితేనే కడుపు నొప్పితో గిలగిల గింజుకుంటాము.. అలాంటిది కడుపులో బ్లేడ్లు, సూదులు, గొలుసులు ఉంటే ఇక ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. మధ్యప్రదేశ్‌లోని సంజయ్‌గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వ్యక్తి కడుపు నుంచి ఏకంగా ఐదు కిలోల ఇనుప వస్తువులను బయటకు తీశారు. అందులో 263 కాయిన్లతోపాటు షేవింగ్‌ బ్లేడ్లు, సూదులు, గొలుసులు ఉన్నాయి.

మహ్మద్‌ మసూక్‌ అనే వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ గత నెల 18వ తేదీన ఆస్పత్రిలో చేరాడు. కడుపునొప్పికి కారణమేంటో తెలుసుకునేందుకు వైద్యులు రకరకాల పరీక్షలు నిర్వహించారు. దీంతో కడుపులో ఏవో వస్తువులున్నట్లు ఎక్స్‌రేలో గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేసి, వాటిని బయటకు తీయాలని ప్రయత్నించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

కడుపులో 263 నాణేలు, పదుల సంఖ్యలో బ్లేడ్లు, ఐదారు గొలుసులు, సూదులను బయటకు తీశారు. ఇనుము, సంబంధిత లోహాల వస్తువులను బాధితుడు మింగినట్లు గుర్తించారు. రోగి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా మింగి ఉంటాడని చెప్పారు. అయితే ఇన్ని వస్తువులు కడుపులోకి చొప్పించుకున్నా బతకి బట్టకట్టడంతో ఈ విషయం తెలుసుకున్న అక్కడివారు ఇదెలా సాధ్యమబ్బా అని చెవులు కొరుక్కుంటున్నారు. 

>
మరిన్ని వార్తలు