సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి నియామకం

2 Nov, 2018 02:53 IST|Sakshi

కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

నేడు ప్రమాణం చేయనున్న జస్టిస్‌ సుభాష్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుభాష్‌రెడ్డిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. దీంతో శుక్రవారం  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన రెండు రోజు ల్లోనే రాష్ట్రపతి ఆ సిఫారసులకు ఆమోదం తెలపడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. 

వ్యవసాయ కుటుంబం నుంచి సుప్రీంకు... 
జస్టిస్‌ సుభాష్‌రెడ్డి 1957 జనవరి 5న మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం కమరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశాలాదేవి, జగన్నాథరెడ్డి. శంకరంపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌ ఆంధ్రా కాలేజీ నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సాధించి 1980 అక్టోబర్‌ 30న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. జస్టిస్‌ బి. సుభాషణ్‌రెడ్డి వద్ద న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన అంశాల్లో వృత్తి నైపుణ్యాన్ని సాధించారు. కళలు, సంగీతంపై మక్కువ చూపే జస్టిస్‌ సుభాష్‌రెడ్డి... 2001–02లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2002 డిసెంబర్‌ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన... 2004 జూన్‌ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2016 ఫిబ్రవరి 13న పదోన్నతిపై గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జస్టిస్‌ సుభాష్‌రెడ్డి న్యాయ నైపుణ్యాన్ని, నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం... ఆయన పేరును  సిఫారసు చేస్తూ గత నెల 30న తీర్మానం చేసింది.  

మరిన్ని వార్తలు